అదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని బరంపూర్ గుట్టపై వెలసిన శ్రీ లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు రథోత్సవం ఘనంగా జరిగింది. స్వామివారి ఉత్సవ విగ్రహాలను భక్తులు ప్రత్యేకంగా అలంకరించి ఊరేగింపు నిర్వహించారు. రంగురంగుల విద్యుత్ దీపాల కాంతుల్లో కళాకారుల నృత్య ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి.
వేలాది మంది భక్తులు వెంకటేశ్వర స్వామి నామస్మరణతో గుట్టను మార్మోగించారు. భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేయడం విశేషం. ముగింపు వేడుకల్లో అన్నమయ్య లడ్డువెం భక్తులకు అందజేశారు. భక్తి పారవశ్యంతో రథోత్సవాన్ని వీక్షించిన భక్తులు స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ కార్యక్రమంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులతో నియోజకవర్గం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో బ్రహ్మోత్సవాల కోసం మరిన్ని ఏర్పాట్లు చేయడానికి కృషి చేస్తానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ ఆడే గజేందర్, మాజీ జెడ్పిటిసి గోక గణేష్ రెడ్డి, మండల కన్వీనర్ కళ్యాణం రాజేశ్వర్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ వేడుకల్లో ఆలయ కమిటీ అధ్యక్షులు కేదారేశ్వర్ రెడ్డి, బరకంమల్లేష్, ప్రభాకర్ రెడ్డి, నాగిరెడ్డి, దామోదర్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, మెరుగు మోహన్ రెడ్డి, ప్రతాప్, మాడురి మల్లేష్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. భక్తి శ్రద్ధలతో నిర్వహించిన ఈ బ్రహ్మోత్సవాలు భక్తుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచాయి.