అమెరికా పాప్ సింగర్ ఎంజీ స్టోన్ (63) కారు ప్రమాదంలో దుర్మరణం చెందారు. శనివారం తెల్లవారుజామున అలబామా నుంచి అట్లాంటాకు తిరిగి వస్తుండగా, ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి మరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎంజీ స్టోన్ అక్కడికక్కడే మృతి చెందారు.
ప్రమాద సమయంలో కారులో ఆమెతో పాటు మరో ఏడుగురు ఉన్నారు. వారు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. స్థానిక అధికారులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టి ప్రమాదానికి కారణాలను విశ్లేషిస్తున్నారు.
ఎంజీ స్టోన్ సంగీత ప్రపంచంలో తనదైన ముద్ర వేశారు. ఆమె మూడుసార్లు గ్రామీ అవార్డుకు నామినేట్ అయ్యారు. ముఖ్యంగా ఆర్‌అండ్‌బీ, సౌల్ సంగీత శైలిలో ఆమెకు విశేషమైన గుర్తింపు ఉంది. ఆమె ఆల్బమ్‌లు అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం పొందాయి.
సంగీత ప్రేమికులు, అభిమానులు ఆమె అకాల మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. పాప్ సంగీతంలో ఆమె మరపురాని పాటలు అందించారని అనేక మంది ప్రముఖులు నివాళులు అర్పించారు. ఆమె మృతి సంగీత ప్రపంచానికి తీరని లోటని సంగీత వర్గాలు పేర్కొన్నాయి.