Allu Arjun: హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసు విచారణ నాంపల్లి కోర్టులో సోమవారం కొనసాగింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న నటుడు అల్లు అర్జున్ వ్యక్తిగత కారణాల వల్ల కోర్టుకు హాజరుకాలేకపోయారని ఆయన తరఫు న్యాయవాది న్యాయస్థానానికి తెలిపారు. అల్లు అర్జున్ గైర్హాజరుపై వివరణ ఇచ్చిన ఆయన న్యాయవాది, మెమోను కోర్టులో సమర్పించారు. దీంతో పాటు ఆయనకు వర్చువల్‌గా విచారణకు హాజరయ్యే అవకాశం ఇవ్వాలా లేదా అనే అంశంపై న్యాయస్థానం పరిశీలనలో ఉందని సంబంధిత పక్షం తెలిపింది.
విచారణ సమయంలో కేసులోని ఇతర నిందితులు సహా మొత్తం 21 మంది కోర్టుకు హాజరైనట్లు సమాచారం. వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణను జూలై 6వ తేదీకి వాయిదా వేశారు. ఈ కేసులో అల్లు అర్జున్‌ను A11 నిందితుడిగా పోలీసులు చేర్చారు. సంధ్య థియేటర్ వద్ద 2024 డిసెంబర్ 4న ‘పుష్ప-2’ బెనిఫిట్ షో సందర్భంగా భారీగా అభిమానులు తరలిరావడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోగా, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు.
దర్యాప్తు అనంతరం పోలీసులు మొత్తం 23 మందిపై ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. A1 నుంచి A10 వరకు థియేటర్ యాజమాన్యాన్ని నిందితులుగా పేర్కొన్నారు. ఇప్పటికే 19 మందికి సమన్లు జారీ అయినట్లు సమాచారం.








