ఇటీవలి కాలంలో అభిమానులు తమ అభిమానాన్ని అతి ఎక్కువగా వ్యక్తపరుస్తున్నారు. తమ హీరో సినిమాలు విడుదలకు ముందు భారీ కటౌట్లు ఏర్పాటు చేయడం సర్వసాధారణం అయింది. తాజా ఉదాహరణగా తమిళ స్టార్ అజిత్ కొత్త సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ కోసం నెల్లైలో 285 అడుగుల కటౌట్ ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 10న ఈ సినిమా విడుదల కానుండటంతో ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి.
ఈ క్రమంలోనే నెల్లై బీఎస్‌ఎస్ సినిమాస్ వద్ద ఏర్పాటు చేసిన భారీ కటౌట్ అచాలంగా నిలవక కుప్పకూలింది. ఆ సమయంలో అక్కడే ఉన్న అభిమానులు తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఎవరికీ గాయాలు కాకపోవడం ఊపిరి పీల్చుకునేలా చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. దీనిపై తలా యాంటీ ఫ్యాన్స్ వ్యంగ్యంగా కామెంట్లు పెడుతున్నారు.
ఈ చిత్రం ట్రైలర్ ఇప్పటికే మంచి స్పందన తెచ్చుకుంది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం అజిత్ ఫ్యాన్స్‌ను మెప్పించనుంది. అర్జున్ దాస్, సునీల్, ప్రసన్న ముఖ్య పాత్రల్లో నటించగా, జి.వి. ప్రకాష్ సంగీతం అందించాడు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. అజిత్‌కు ఇది మరో భారీ హిట్ అవుతుందని అంచనాలు ఉన్నాయి.
గతంలోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. 2019లో కూడా కటౌట్ మీద పాలాభిషేకం చేస్తుండగా అది కూలిపోవడంతో ఐదుగురు గాయపడ్డారు. అప్పట్లో కటౌట్‌పై 12 మంది ఎక్కడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. అజిత్ గతంలో సోషల్ మీడియాలో అభిమానులను ఇటువంటి పనులు చేయవద్దని కోరినా వారు మాత్రం తనపై ఉన్న ప్రేమతో రిస్క్ తీసుకుంటూ ఇబ్బందులకు గురవుతున్నారు.