Indigo Flight Ticket Price: దేశవ్యాప్తంగా ఇండిగో విమానాల రద్దు కొనసాగుతున్న నేపథ్యంలో విమాన ప్రయాణికులపై భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక జోక్యం చేసుకుంది. ఇండిగో వరుసగా వెయ్యికిపైగా విమానాలను రద్దు చేయడంతో అత్యవసర ప్రయాణాలు చేస్తున్న వేలాదిమంది ఎయిర్‌పోర్టుల్లో ఇబ్బందులకు గురవుతున్నారు. కౌంటర్లు వద్ద నిరసనలు, వాగ్వాదాలు చోటు చేసుకుంటుండటంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
విమానాల రద్దు నేపథ్యంలో ఇతర ఎయిర్‌లైన్స్ టికెట్ రేట్లను పెంచడం ప్రారంభించాయి. దీనిని అడ్డుకునేందుకు కేంద్రం టికెట్ల ధరలపై క్యాపింగ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇండిగో సర్వీసులు నిలిచిపోయిన మార్గాల్లో ప్రభుత్వమే నిర్ణయించిన ధరలను పాటించాలని అన్ని విమానయాన సంస్థలకు సూచించింది.
ALSO READ:Shamshabad Airport bomb threat | కోవైట్, లండన్ ఫ్లైట్లకు బాంబు బెదిరింపు కలకలం
ఈ పరిమితులు పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకునే వరకు అమల్లో ఉంటాయని వెల్లడించింది. టికెట్ ధరలపై రియల్ టైమ్ నిఘా చేపడుతున్నట్లు కూడా కేంద్రం స్పష్టం చేసింది.
హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 69 ఇండిగో సర్వీసులు రద్దు కావడంతో భారీగా ప్రయాణికులు నిలిచిపోయారు. అదే విధంగా విశాఖపట్నంలో చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్ మార్గాల్లో తొమ్మిది సర్వీసులు రద్దయ్యాయి.
విమానాల రద్దుపై ముందస్తు సమాచారం ఇవ్వలేదంటూ ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, శంషాబాద్‌లో తీసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సాధారణ స్థితికి చేరుకోవడానికి మరో 10–15 రోజులు పట్టవచ్చని ఇండిగో, విమానాశ్రయ అధికారులు సూచించారు.
