జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు సుమన్ మద్దతు — సోనియా, రాహుల్, రేవంత్‌లకు ధన్యవాదాలు


జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలు వేడెక్కుతున్న వేళ, ప్రముఖ తెలుగు సినీ నటుడు సుమన్ తన రాజకీయ మద్దతును స్పష్టంగా ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయన ప్రకటించారు. ఈ మేరకు సుమన్ ఓ వీడియో సందేశం విడుదల చేస్తూ, నవీన్‌కు కాంగ్రెస్ టిక్కెట్ ఇచ్చినందుకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు.

సుమన్ మాట్లాడుతూ, “నవీన్ యాదవ్ ఒక యువకుడు, సేవా నిరతి కలిగిన వ్యక్తి. జూబ్లీహిల్స్ ప్రజలకు అతను మంచి నాయకుడిగా నిలుస్తాడని నమ్ముతున్నాను. ఆయనను అత్యధిక మెజార్టీతో గెలిపించండి” అని కోరారు. అలాగే, “నా మద్దతు ఎల్లప్పుడూ నవీన్‌కే ఉంటుంది. ఆల్ ది బెస్ట్ నవీన్, టేక్ కేర్” అంటూ తన సందేశాన్ని ముగించారు.

జూబ్లీహిల్స్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ పోటీ చేయడం అక్కడి రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఆయన తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ స్థానికంగా సుపరిచితమైన పేరు. ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినా, ఆయనకు రాజకీయాలపై పరోక్ష అనుబంధం ఉండేది. యూసుఫ్‌గూడ, రెహ్మత్ నగర్, కూకట్‌పల్లి, ఖైరతాబాద్ వంటి ప్రాంతాల్లో ఆయనకు విస్తృత పరిచయం ఉండేది.

సినీ నటుడు సుమన్ మద్దతు రావడంతో నవీన్ యాదవ్ అభ్యర్థిత్వానికి మరింత బలం చేకూరిందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. ఉప ఎన్నికల ప్రచారం ఉత్కంఠభరిత దశలోకి అడుగుపెడుతున్న ఈ సమయంలో ఈ ప్రకటన కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని రేకెత్తించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *