ఫుల్ స్టోరీ అఫ్ : దేవి నవరాత్రులు, 11 అవతారాల అమ్మవారి దర్శనం


ప్రతి ఏడాది పది అలంకారాలు జరుగుతూ వస్తున్నా.. ఈసారి మాత్రం అమ్మవారు 11 అలంకారాలలో దర్శనం ఇవ్వనున్నారు. బాలత్రిపుర సుందరి నుంచి రాజేశ్వరి దేవి వరకు 11 రోజులు 11 అలంకారాలలో అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు.ఈ రోజులలో ప్రతి రోజు ప్రత్యేక వస్త్రాలు, ప్రత్యేక నైవేద్యాలు అర్చకులు అమ్మవారికి సమర్పించనున్నారు. నైవేద్యాలలో అమ్మవారికి తీపి బూంది నుంచి చక్కెర పొంగలి వరకు వివిధ నైవేద్యాలను సమర్పించనున్నారు. అలాగే అమ్మవారిని రంగు రంగుల పట్టు చీరలతో సరికొత్తగా ముస్తాబు చేయనున్నారు.

ప్రతి పదేళ్లకు ఒక సారి తిథి వృద్ధి చెందుతుంది. దీంతో దసరా శరన్నవరాత్రులు 11 రోజుల పాటు జరుగుతాయి. ఇంతకు ముందు ఇలా 2016లో 11 రోజుల పాటు జరిగాయి. అప్పుడు కూడా తిథి వృద్ధి చెందడంతో అమ్మవారిని కాత్యాయినీదేవిగా అలంకరించారు. మళ్లీ ఈ ఏడాది ఈ ఏడాది అమ్మవారికి కాత్యాయినీదేవి అలంకారం చేయనున్నారు.

దసరా సందర్భంగా విజయవాడ కనక దుర్గమ్మ ఆలయంలో నిర్వహించే శరన్నవరాత్రి వేడుకల్లో ఈసారి ఆధునిక సాంకేతికతను పెద్దఎత్తున వినియోగించేలా అధికారులు సన్నాహాలు చేశారు. భక్తులు వినాయక ఆలయం వద్ద క్యూలైన్లలోకి ప్రవేశించే మార్గం, ఘాట్‌రోడ్డు వద్ద.. ప్రత్యేక మెటల్‌ డిటెక్టర్ల మాదిరిగా AIతో అనుసంధానించిన పరికరాలను అమర్చారు. ఇంద్రకీలాద్రి పరిసర ప్రాంతాలు, స్నాన ఘాట్లు, పార్కింగ్‌ ప్రదేశాలు సహా భక్తుల రద్దీ అధికంగా ఉండే ప్రాంతాలన్నింటినీ డ్రోన్‌ కెమెరాలతో పర్యవేక్షిస్తారు. ఇవన్నీ కమాండ్‌ కంట్రోల్‌ రూంతో అనుసంధానమై ఉంటాయి.

నవరాత్రుల్లో అమ్మవారు వివిధ రూపాల్లో దర్శనమిస్తూ భక్తులను కటాక్షిస్తుంటారు.

మొదటి రోజు – బాలా త్రిపురసుందరీ దేవి
నైవేద్యం: తీపి బూంది, శనగలు లేదా పెసరపప్పు పాయసం
వస్త్రం: ఆరెంజ్ రంగు చీర

రెండవ రోజు – గాయత్రీ దేవి
నైవేద్యం: రవ్వకేసరి, పులిహోర
వస్త్రం: నీలం రంగు చీర

మూడవ రోజు – అన్నపూర్ణ దేవి
నైవేద్యం: దద్ధోజనం, కట్టె పొంగలి
వస్త్రం: పసుపు రంగు చీర

నాల్గవ రోజు కాత్యాయని దేవి
నైవేద్యం: బెల్లం అన్నం, అన్నం–ముద్దపప్పు
వస్త్రం: పూర్తి ఎరుపు రంగు చీర

ఐదవ రోజు మహాలక్ష్మీ దేవి
నైవేద్యం: పూర్ణాలు, క్షీరాన్నం, బెల్లం లేదా పంచదారతో చేసినది
వస్త్రం: గులాబీ రంగు చీర

ఆరవ రోజు లలితా త్రిపురసుందరీ దేవి
నైవేద్యం: పులిహోర, పెసర బూరెలు
వస్త్రం: ఆకుపచ్చ రంగు చీర

ఏడవ రోజు మహాచండీ దేవి
నైవేద్యం: లడ్డు ప్రసాదం
వస్త్రం: ఎరుపు రంగు చీర

ఎనిమిదవ రోజు – సరస్వతి దేవి
నైవేద్యం: పరవణ్ణం, అటుకులు, బెల్లం, శనగపప్పు, కొబ్బరి
వస్త్రం: తెలుపు రంగు చీర

తొమ్మిదవ రోజు – దుర్గాదేవి
నైవేద్యం: గారెలు, నిమ్మరసం కలిపిన అల్లంముక్కలు
వస్త్రం: ఎరుపు రంగు చీర

పదవ రోజు – మహిషాసురమర్ధిని దేవి
నైవేద్యం: చక్రపొంగలి, పులిహోర, గారెలు, వడపప్పు, నిమ్మరసం, పానకం
వస్త్రం: ఎరుపు రంగు చీర

పదకొండవ రోజు – రాజరాజేశ్వరి దేవి
నైవేద్యం: పులిహోర, గారెలు
వస్త్రం: ఆకుపచ్చ రంగు చీర.

నవరాత్రిలో మొదటి దీపాన్ని ఇంటిలో పూజ గదిలో లేదా పూజ ప్రాంతంలో వెలిగించాలి. ఈ దీపం తొమ్మిది రోజుల పాటు నిరంతరం వెలుతూ ఉండాలి. దీనిని అఖండ జ్యోతి అని కూడా పిలుస్తారు. ఈ దీపం ఇంట్లో సానుకూల శక్తిని తెస్తుంది. అన్ని కష్టాలను తొలగిస్తుంది. మీరు అఖండ జ్యోతిని వెలిగించలేకపోతే.. ఉదయం , సాయంత్రం నెయ్యితో లేదా నూనెతో దీపాన్ని ఖచ్చితంగా వెలిగించాలని చెబుతున్నారు. దీపం వెలిగించేటప్పుడు ‘ఓం దుం దుర్గాయే నమః’ అనే మంత్రాన్ని జపించాలని పండితులు సూచిస్తున్నారు.

సెప్టెంబ‌ర్ 29న అమ్మ‌వారి జ‌న్మ‌న‌క్ష‌త్ర‌మైన మూలా న‌క్ష‌త్రం క‌నుక.. ఆ రోజు తెల్ల‌వారుజామున 2 గంట‌ల నుంచి రాత్రి 11 గంట‌ల వ‌ర‌కు భక్తులకు అమ్మ‌వారి ద‌ర్శ‌నం క‌ల్పిస్తారు. అదే రోజున మ‌ధ్యాహ్నం ముఖ్య‌మంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున అమ్మ‌వారికి ప‌ట్టువ‌స్త్రాల‌ను స‌మ‌ర్పిస్తారు. దేవీ నవరాత్రుల చివరి రోజు అక్టోబర్ 2వ తేదీన ఉదయం 9 గంటల 30 నిమిషాలకు పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది. అదే రోజు సాయంత్రం ఐదు గంటలకు కృష్ణా నదిలో హంసవాహక తెప్పోత్సవం నిర్వహిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *