మేడ్చల్ జిల్లా కుషాయిగూడ ఆర్టీసీ డిపోలో జరిగిన అగ్నిప్రమాదం స్థానికంగా కలకలం రేపింది. డిపోలో నిలిపివున్న ఓ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. వేగంగా వ్యాపించిన మంటలు పక్కనే ఉన్న మరో బస్సుకు అంటుకుని, దహనమయ్యాయి.
అగ్ని ప్రమాదాన్ని గమనించిన డిపో సిబ్బంది వెంటనే స్పందించారు. ఫైర్ సేఫ్టీ సిలిండర్లతో మంటలు అదుపులోకి తేవడానికి ప్రయత్నించారు. అయితే మంటలు పెరిగిపోవడంతో వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ ఇంజన్ సహాయంతో సిబ్బంది మంటలను అదుపు చేశారు.
ఈ ఘటనలో ఓ బస్సు పూర్తిగా దగ్ధమవ్వగా, మరొక బస్సు సగానికి పైగా కాలిపోయింది. వేగంగా స్పందించిన అగ్నిమాపక సిబ్బంది, సమీపంలోని బస్సులను వెనక్కి తరలించి మరింత నష్టం జరిగేలా అడ్డుకున్నారు. ఈ ప్రమాదం కారణంగా భారీ ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది.
అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమా లేక ఇతర కారణాలా అనేదానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో డిపో సిబ్బంది, ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
