అమెరికా స్థానిక ఎన్నికల్లో భారత సంతతికి చెందిన నాయకులు మరోసారి తమ ప్రతిభను చాటుకున్నారు.వర్జీనియా రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్‌గా డెమోక్రటిక్ పార్టీ నాయకురాలు గజాలా హష్మీ విజయకేతనం ఎగురవేశారు.
ఈ పదవికి ఎన్నికైన తొలి ముస్లిం మహిళగా చరిత్ర సృష్టించారు. హైదరాబాద్ మూలాలు కలిగిన ఆమె విజయంతో తెలుగు ప్రజల్లో గర్వభావం నెలకొంది.
1964లో హైదరాబాద్‌లో జన్మించిన గజాలా హష్మీ చిన్ననాటి రోజులు మలక్‌పేటలోని అమ్మమ్మ ఇంట్లో గడిపారు. ఆమె తాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక విభాగంలో పనిచేసేవారు.
నాలుగేళ్ల వయసులో తల్లి,సోదరుడితో కలిసి అమెరికాలోని జార్జియాకు వెళ్లిన గజాలా అక్కడే స్థిరపడ్డారు.
చదువులో ఎల్లప్పుడూ ప్రతిభ కనబరుస్తూ గజాలా అనేక స్కాలర్‌షిప్పులు సాధించారు. జార్జియా సదరన్ విశ్వవిద్యాలయంలో బీఏ ఆనర్స్ పూర్తి చేసిన ఆమె, అట్లాంటాలోని ఎమరీ విశ్వవిద్యాలయం నుండి సాహిత్యంలో పీహెచ్‌డీ పొందారు.
1991లో అజహర్‌ను వివాహం చేసుకున్న అనంతరం రిచ్‌మండ్‌కు మారి,రేనాల్డ్స్ కమ్యూనిటీ కళాశాలలో మూడు దశాబ్దాల పాటు ప్రొఫెసర్‌గా పనిచేశారు.
2019లో తొలిసారిగా రాజకీయ రంగప్రవేశం చేసిన గజాలా హష్మీ, అమెరికా సెనేట్ ఎన్నికల్లో గెలిచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2024లో సెనేట్ విద్యా, వైద్య కమిటీ ఛైర్‌పర్సన్‌గా ఎన్నికై ప్రజాసేవలో కొనసాగుతున్నారు.
