ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన ‘హత్య’ సినిమా జనవరి 24న థియేటర్లలో విడుదలైంది. ప్రేక్షకుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లభించకపోయినా, కథలోని మిస్టరీ మూమెంట్స్ ఆసక్తికరంగా ఉంటాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో విడుదలై, కొత్త ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఈ కథ పులివెందుల నేపథ్యంలో సాగుతుంది. రాజకీయంగా ప్రముఖుడు దయానంద్ రెడ్డి (రవివర్మ) దారుణంగా హత్యకు గురవుతాడు. ఈ కేసును ఛేదించేందుకు పోలీస్ ఆఫీసర్ సుధారావు (ధన్య బాలకృష్ణ) రంగంలోకి దిగుతుంది. విచారణలో అనేక అనుమానాస్పద విషయాలు వెలుగు చూస్తాయి. అప్పులు, కుట్రలు, రాజకీయం, హత్య వెనుక ఉన్న రహస్యాలు ఏమిటనేది కథను ఉత్కంఠగా నడిపిస్తుంది.
కథాంశం ఒక ప్రముఖ రాజకీయ హత్య కేసుకు దగ్గర పోలికలు కలిగి ఉంది. ముఖ్యమంత్రి బాబాయ్‌గా ఉన్న వ్యక్తి హత్య, బాత్‌రూమ్‌లో శవమై పడివుండటం, ముందుగా గుండెపోటు అనుకోవడం, డాక్యుమెంట్లు మాయమవడం వంటి అంశాలు, గతంలో జరిగిన కొన్ని రాజకీయ సంఘటనలను గుర్తుకు తెస్తాయి. ఈ కథను సహజంగా, తక్కువ బడ్జెట్‌లో మిస్టరీ టచ్‌తో తెరకెక్కించడంలో దర్శకురాలు శ్రీవిద్య బసవ మంచి ప్రయత్నం చేశారు.
పాత్రల్లో రవివర్మ హావభావాలు బాగా పండించారు. ధన్య బాలకృష్ణ పోలీస్ ఆఫీసర్‌గా ఆకట్టుకుంది. పూజా రామచంద్రన్ పాత్ర స్ఫూర్తిదాయకంగా సాగింది. అభిరాజ్ రాజేంద్రన్ సినిమాటోగ్రఫీ, నరేశ్ కుమరన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. థియేటర్లలో పెద్దగా ప్రభావం చూపని ఈ సినిమా, ఓటీటీలో మంచి రీచ్ పొందే అవకాశం ఉంది.