బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సోదరి దివ్యా గౌతమ్ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎంఎల్) తరఫున ఆమె దిఘా నియోజకవర్గం నుండి పోటీ చేయనున్నారు.
దివ్యా గౌతమ్ గతంలో ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్ఏ) అధ్యక్షురాలిగా పనిచేశారు. విద్యార్థి ఉద్యమాల ద్వారా ప్రజల్లో గుర్తింపు పొందిన ఆమె, ఇప్పుడు రాజకీయ రంగంలో అడుగుపెడుతున్నారు. కమ్యూనిస్ట్ పార్టీ టికెట్‌పై పోటీ చేసేందుకు రేపు నామినేషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం.
ప్రస్తుతం బీహార్‌లో ప్రతిపక్ష కూటమి మహాఘట్ బంధన్ సీట్ల పంపకాలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఆర్జేడీ ఆధ్వర్యంలోని ఈ కూటమిలో సీపీఐ (ఎంఎల్) కూడా భాగస్వామి. అయితే సీట్ల పంపకాలు తుది దశకు రాకముందే సీపీఐ (ఎంఎల్) తమ అభ్యర్థులను కొన్ని స్థానాల్లో ప్రకటించింది. దివ్యా గౌతమ్ అభ్యర్థిత్వం కూడా ఆ జాబితాలో భాగమైంది.
ఎన్నికల షెడ్యూల్ ప్రకారం, బీహార్ అసెంబ్లీ ఎన్నికలు రెండు విడతల్లో జరగనున్నాయి. నవంబర్ 6 మరియు 11 తేదీలలో పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపుతో పాటు ఫలితాలు ప్రకటించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.
దివ్యా గౌతమ్ రాజకీయ రంగప్రవేశం బీహార్‌లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కుటుంబానికి ప్రజల్లో ఉన్న అభిమానాన్ని దివ్యా ఎలా రాజకీయంగా వినియోగించుకుంటారన్నది చూడాల్సి ఉంది.
