మానవత్వాన్ని మరిచిపోయే ర్యాగింగ్, సీనియర్ల వేధింపులు మరోసారి ఓ అమాయక విద్యార్థి ప్రాణాన్ని బలితీసుకున్నాయి. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన రాష్ట్రాన్ని కలచివేస్తోంది.
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం లక్కారం గ్రామానికి చెందిన జాదవ్ ప్రేమ్‌సింగ్ పెద్ద కుమారుడు జాదవ్ సాయితేజ, ఘట్కేసర్ మండలం కొర్రెములలోని సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో రెండో సంవత్సరం బీటెక్ చదువుతున్నాడు. నారపల్లిలోని హాస్టల్లో ఉంటూ చదువులు కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఇటీవల ఓ ఫస్ట్ ఇయర్ విద్యార్థి పుట్టినరోజు వేడుకకు సాయితేజ హాజరయ్యాడు. అక్కడ తోటి విద్యార్థి డేవిడ్‌తో అతనికి తగవు జరిగింది. ఈ విషయాన్ని తెలిసిన సీనియర్ విద్యార్థి బండారి చిన్నబాబు ఇరువురికి రాజీ కుదిర్చాడు.
కానీ అదే సాయితేజ జీవితాన్ని దురదృష్టవశాత్తూ కబళించింది. రాజీ చేయించినందుకు గానూ పార్టీ ఇవ్వాలని చిన్నబాబు ఒత్తిడి చేశాడు. ఆదివారం రాత్రి నారపల్లిలోని ఓ బార్లో చిన్నబాబు సహా మరో ఏడుగురు విద్యార్థులు ఫుల్‌గా మద్యం తాగి రూ.8 వేల బిల్లు చేశారు. సాయితేజ వద్ద కేవలం రూ.2,500 మాత్రమే ఉండటంతో అదే చెల్లించాడు. మిగతా బిల్లుకు చిన్నబాబు తీవ్రంగా ఒత్తిడి చేయడంతో పాటు అవమానకరంగా మాట్లాడాడు.
మనస్తాపం చెందిన సాయితేజ హాస్టల్‌కు చేరుకొని తండ్రికి వీడియో కాల్ చేశాడు. “చిన్నబాబు వేధింపులు భరించలేకపోతున్నా… ఇక బ్రతకలేను” అని కన్నీటి కళ్లతో చెప్పి ఫోన్ కట్ చేశాడు. ఆ వెంటనే తన గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు.
విషాదంలో మునిగిన తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా, చిన్నబాబు సహా 8 మందిపై ఎట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. కళాశాల వద్ద భారీగా ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టగా, పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ మృతి పై కళాశాల యాజమాన్యం కూడా స్పందించింది. చిన్నబాబు సంవత్సరం నుంచి తరగతులకు హాజరుకాకపోవడంతో విద్యార్థిగా పరిగణించడం కష్టమని స్పష్టం చేశారు. అయితే, అమాయక విద్యార్థి ప్రాణం బలైన ఘటనపై విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటన మరోసారి ర్యాగింగ్, సీనియర్ల దౌర్జన్యం ఎటువంటి ప్రమాదకర పరిణామాలకు దారితీస్తుందో నిరూపించింది. ఒక అమాయక విద్యార్థి ప్రాణం పోయింది కానీ, సమాజం ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.
