పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) 2025 సీజన్ ఏప్రిల్ 11 నుంచి ప్రారంభం కానుంది. ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ కారణంగా టోర్నీ ముందుకు జరగకపోవడంతో తొలిసారి ఐపీఎల్‌తో పోటీకి దిగనుంది. అయితే, ఈ నేపథ్యంలో పీఎస్ఎల్ ఫ్రాంచైజీ ముల్తాన్ సుల్తాన్స్ చేసిన ఒక వీడియో భారత క్రికెట్ అభిమానుల ఆగ్రహానికి దారి తీసింది.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మీడియా సమావేశంలో మాట్లాడిన మాటలను వాయిస్ ఓవర్‌గా వాడుతూ, ముల్తాన్ సుల్తాన్స్ తన మస్కట్‌కు ఓ వీడియో రూపొందించింది. లావుగా ఉన్న మస్కట్‌ను చూపిస్తూ హిట్‌మ్యాన్‌ను బాడీ షేమింగ్ చేసినట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది అగౌరవకరమని, రోహిత్‌ను కించపరిచే విధంగా ఉందని భారత అభిమానులు మండిపడుతున్నారు.
ఈ వీడియోపై సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురుస్తోంది. ‘‘వరుసగా రెండు ఐసీసీ ట్రోఫీలు గెలిపించిన కెప్టెన్‌ను కించపరిచేలా వ్యవహరించకండి’’, ‘‘మీరు ముందు ఒక్క ఐసీసీ ట్రోఫీ అయినా గెలవండి’’, ‘‘బ్రాడ్ హాగ్ విషయంలో గొడవ చేసిన పాక్ మాజీ ఆటగాళ్లు ఇప్పుడేమంటారు?’’ అంటూ ఫ్యాన్స్ తమ నిరసన తెలియజేస్తున్నారు.
ఇటీవల టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన అనంతరం రోహిత్ శర్మ మీడియా సమావేశంలో మాట్లాడిన మాటలను ఈ వీడియోలో ఉపయోగించారు. దీనిపై అధికారిక వివరణ ఇవ్వాలని, రోహిత్ వాయిస్‌ను తక్షణమే తొలగించాలని భారత క్రికెట్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.