టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా మరోసారి తన స్పష్టమైన వ్యక్తిత్వాన్ని బయటపెట్టారు. వ్యక్తిగత జీవితంపై మాట్లాడటంలో తడబాటు లేకుండా తన ఆలోచనలను బహిరంగంగా పంచుకునే తమన్నా, ఈసారి ‘యువా’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రిలేషన్షిప్ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తమన్నా మాట్లాడుతూ, “నాకు అబద్ధాలు చెప్పేవాళ్లను అస్సలు సహించలేను. ఎవరైనా తప్పు చేస్తే, సమస్య ఉంటే నేను దాన్ని పరిష్కరించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. అవసరమైతే మీరు హత్య చేసినా దాన్ని కప్పిపుచ్చడానికి నేను సహాయం చేయగలను (నవ్వుతూ). కానీ అబద్ధం మాత్రం అస్సలు వద్ద. అది నాకు భరించలేని విషయం,” అని చెప్పారు.
ఆమె ఇంకా వివరిస్తూ, “నాకు కోపం వచ్చేది కేవలం అబద్ధం చెప్పినందుకు కాదు, దాన్ని నేను నమ్ముతానని అనుకునేంతగా అవతలి వారు నన్ను మూర్ఖురాలిగా భావించడం వల్ల. ఎవరో మనల్ని తెలివితక్కువ వాళ్లమని అనుకోవడం అసలు సమస్య,” అని స్పష్టం చేశారు.
తమన్నా యొక్క ఈ వ్యాఖ్యలు ఆమె నిజాయతీకి ఎంత ప్రాధాన్యం ఇస్తారో సూచిస్తున్నాయి. రిలేషన్షిప్లో నమ్మకం, నిజాయతీ అనే విలువలను ఆమె ప్రాముఖ్యంగా చూస్తున్నట్లు తెలుస్తోంది.
తమన్నా గతంలో నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. 2023లో విడుదలైన ‘లస్ట్ స్టోరీస్ 2’ వెబ్ సిరీస్ ప్రమోషన్ సమయంలో వీరిద్దరూ తమ బంధాన్ని బహిరంగంగా అంగీకరించారు. తర్వాత పలు ఈవెంట్లకు కలిసి హాజరయ్యారు. కానీ ఇటీవలే వీరిద్దరి మధ్య విరహం వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
గతంలో కూడా తమన్నా మాట్లాడుతూ, “నేను ఒక గొప్ప జీవిత భాగస్వామిగా మారేందుకు కృషి చేస్తున్నాను. ఎవరి జీవితంలోకి నేను వస్తానో వారు గత జన్మలో పుణ్యం చేసుకున్నట్లే,” అని చెప్పడం ఆమె ఆలోచనా దోరణిని చూపించింది.
తాజా ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలతో తమన్నా నిజాయతీ, నమ్మకం అనే మూల్యాలకు ఎంత ప్రాముఖ్యత ఇస్తారో మరోసారి నిరూపించారు. ఆమె చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
