కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా సంచలనంగా మారాయి. ఈసారి ఆయన వ్యంగ్యాస్త్రాలు విపక్షాలపై కాదు… దివంగత ప్రధాని రాజీవ్ గాంధీపై పేల్చారు. ఆయన విద్యా నేపథ్యం, కేంబ్రిడ్జ్, ఇంపీరియల్ కాలేజీల్లో విఫలమైన విషయాలను ప్రస్తావిస్తూ, అలాంటి వ్యక్తి దేశ ప్రధాని ఎలా అయ్యారని ప్రశ్నించారు.
“రాజీవ్ గాంధీ విద్యార్థి దశలో రెండు సార్లు పరీక్షలు తప్పారు. కేంబ్రిడ్జ్ వర్సిటీలో ఫెయిల్ అయ్యారు, అక్కడ ఫెయిలవడం చాలా అరుదు. ఎందుకంటే, అధిక సంఖ్యలో విద్యార్థులు ఫెయిల్ అయితే వర్సిటీకి చెడ్డపేరు వస్తుందని, అందరినీ పాస్ చేసే ప్రయత్నం చేస్తారు. అలాంటి చోట కూడా ఆయన ఫెయిల్ అయ్యారు. ఆ తర్వాత లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీలో చేరి అక్కడ కూడా విఫలమయ్యారు. అయినా ఆయన ఎలా ప్రధాని అయ్యారు?” అంటూ మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలను బీజేపీ నేతలు కాంగ్రెస్‌పై విమర్శించేందుకు మారుగ చేశారు. రాజీవ్ గాంధీ ప్రధాని అయ్యే అర్హత లేదని కాంగ్రెస్ నేతలే అంగీకరిస్తున్నారా? అని ప్రశ్నించారు. మణిశంకర్ అయ్యర్ మాటలు కాంగ్రెస్ అసలు స్వరూపాన్ని బయటపెడుతున్నాయంటూ విమర్శలు గుప్పించారు. ఈ విషయాన్ని ప్రచారానికి ఉపయోగించుకునేందుకు బీజేపీ ప్రత్యేకంగా కసరత్తు చేస్తోంది.
కాంగ్రెస్ నేతలు ఈ ఆరోపణలను తిప్పికొడుతూ, మణిశంకర్ అయ్యర్ నిరాశతో అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధులు మాట్లాడుతూ, అయ్యర్ బీజేపీకి ‘స్లీపర్ సెల్’గా మారిపోయారని ఆరోపించారు. తన వ్యాఖ్యలు కాంగ్రెస్‌కు నష్టం కలిగించేలా ఉన్నాయని, పార్టీ దీనిపై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.