తెలంగాణ ప్రభుత్వం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. దీనితో యాదగిరిగుట్ట ఆలయానికి స్వయం ప్రతిపత్తి లభించనుంది. అయితే, ఆలయం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే కొనసాగనుంది.
ట్రస్ట్ బోర్డు ఏర్పాటుకు సంబంధించి నిబంధనలు, పదవీకాలం, నిధుల నిర్వహణ, ఉద్యోగ నియామకాలు, బదిలీలకు సంబంధించిన సర్వీస్ రూల్స్‌ను మంత్రివర్గం పరిశీలించింది. దేవాదాయ శాఖ చట్టం-1987లోని చాప్టర్ 14 కింద యాదగిరిగుట్ట దేవస్థానాన్ని చేర్చారు. దీనికై త్వరలో అసెంబ్లీలో చట్టసవరణ చేపట్టనున్నట్లు సమాచారం.
ఈవో నియామకంలో ఐఏఎస్ అధికారి లేదా అదనపు కమిషనర్ స్థాయి అధికారిని నియమించాలని నిర్ణయించారు. ట్రస్ట్ బోర్డుకు ఒక చైర్మన్‌తో పాటు 10 మంది సభ్యులను నియమిస్తారు. వీరిలో ఒకరు ఫౌండర్ ట్రస్టీ కాగా, మిగిలిన తొమ్మిది మందిని ప్రభుత్వం నామినేట్ చేయనుంది. ఎక్స్అఫీషియో సభ్యుల నియామకం కూడా చేపడతారు.
ఈ ట్రస్ట్ బోర్డుతో యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధికి మరింత మద్దతు లభించనుంది. ఆలయ నిర్వహణ, నిధుల వినియోగం, అభివృద్ధి పనులు మరింత మెరుగుపడనున్నాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం భక్తుల హితాన్ని దృష్టిలో పెట్టుకుని తీసుకున్నదని అధికారులు వెల్లడించారు.