ప్రయాణికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంస్థలపై వినియోగదారుల హక్కులను రక్షించడంలో వినియోగదారుల ఫోరమ్ ఎంత మేరకు కఠినంగా వ్యవహరిస్తుందో మరోసారి రుజువైంది. ఈసారి బలయ్యిందిగాక, తగిన గుణపాఠం పొందింది కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ – KSRTC.
ఈ సంఘటన 2018లో చోటుచేసుకుంది. కేరళలోని చూరకోడ్‌లో ఉన్న ఎన్ఎస్ఎస్ హయ్యర్ సెకండరీ పాఠశాలలో పనిచేస్తున్న ప్రియ అనే టీచర్, తన పీహెచ్డీ గైడ్‌ను కలిసేందుకు మైసూర్ వెళ్లాల్సి ఉండటంతో, కొట్టారక్కర డిపో నుంచి ఆన్లైన్లో కేరళ ఆర్టీసీకి చెందిన స్కానియా బస్సులో టికెట్ బుక్ చేసుకున్నారు. బస్సు రాత్రి 8:30కి బయలుదేరాల్సి ఉండగా, ప్రియ సమయానికి బస్ స్టేషన్‌కు చేరుకున్నారు. అయితే, ఎన్నిసార్లు ఫోన్ చేసినా అధికారులు తృప్తికరమైన సమాచారం ఇవ్వకుండా, చివరికి బస్సు రద్దయిందన్న సమాచారాన్ని రాత్రి 9 గంటల తర్వాత వెల్లడించారు.
ప్రత్యామ్నాయ బస్సు ఏర్పాటు చేయాలని ప్రియ విజ్ఞప్తి చేసినా, అధికారులు నిర్లక్ష్యంగా స్పందించారు. చేసేదేం లేక ఆమె టాక్సీలో కాయంకుళం వెళ్లి, అక్కడి నుంచి మరో బస్సు ద్వారా మైసూర్ చేరుకున్నా, సమయానికి ఆలస్యం కావడంతో గైడ్‌తో జరగాల్సిన ముఖ్యమైన సమావేశం రద్దయింది. ఫలితంగా, ఆమె మైసూర్లో మూడు రోజులు అదనంగా ఉండాల్సి వచ్చింది, దాంతో పాటు ఆర్థికంగా నష్టపోయారు, మానసికంగా తీవ్రంగా బాధపడాల్సి వచ్చింది.
ఈ ఘటనపై కేరళ ఆర్టీసీకి ఫిర్యాదు చేసినా వారు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో, ప్రియ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ను ఆశ్రయించారు. విచారణ అనంతరం, కమిషన్ కేరళ ఆర్టీసీ వైఫల్యాన్ని స్పష్టం చేస్తూ, ప్రియకు మొత్తం రూ. 82,555 పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఇందులో టికెట్ ధరతో పాటు ప్రయాణ ఖర్చులు, మానసిక నష్టం, మిగిలిన ఇబ్బందులన్నింటికీ పరిహారంగా ఈ మొత్తం నిర్ణయించబడింది.
అయితే ఆర్టీసీ ఈ ఆదేశాలను పట్టించుకోకపోవడంతో, వినియోగదారుల కమిషన్ ఏకంగా కేరళ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ)పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ పరిణామంతో ఉలిక్కిపడ్డ కేఎస్ ఆర్టీసీ ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకుని బాధితురాలికి పూర్తి పరిహారం చెల్లించారు. అరెస్ట్‌ను తప్పించుకునేందుకు ఎండీ స్వయంగా చర్యల్లో దిగాల్సి వచ్చింది.
ఈ ఘటన సామాన్య ప్రయాణికులకు న్యాయం లభించే మార్గాలను గుర్తు చేస్తూ, ప్రభుత్వ రంగ సంస్థల నిర్లక్ష్యాన్ని నిలదీయగల న్యాయ వ్యవస్థ శక్తిని మరోసారి స్పష్టంగా చూపింది. కేవలం రూ. 1,003 టికెట్ వల్ల ప్రారంభమైన సంఘటన చివరికి రూ. 82,000 పరిహారం వరకు దారి తీసింది. ఇది ఇతర సంస్థలకు, అధికారులకు గుణపాఠంగా నిలిచే అవకాశం ఉంది.
