మహారాష్ట్రలోని పూణెలో స్వర్‌గేట్ బస్ స్టేషన్ వద్ద యువతిపై లైంగికదాడికి పాల్పడిన నిందితుడు దత్తాత్రేయ రాందాస్‌ను 75 గంటల అనంతరం క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన దుమారం రేపడంతో పోలీసులు అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. డ్రోన్లు, శునక దళాలు, 100 మంది పోలీసుల సహాయంతో మహారాష్ట్ర వ్యాప్తంగా అతడిని వెతికారు.
నిందితుడు రాందాస్ గురువారం రాత్రి తన బంధువుల ఇంటికి వెళ్లాడు. అతడి చేసిన ఘాతుకం గురించి అప్పటికే తెలిసిన బంధువులు పోలీసులకు సమాచారం అందించారు. ఇంటి నుంచి వెళ్లిపోయే ముందు రాందాస్ తన తప్పును అంగీకరించి లొంగిపోతానని చెప్పాడు. అయితే, పోలీసులు అతని కదలికలను గమనిస్తూ చివరికి ఓ చెరుకు తోటలో అతడిని పట్టుకున్నారు.
పోలీసుల ప్రకారం, రాందాస్‌పై ఇప్పటికే పలు క్రిమినల్ కేసులు ఉన్నాయి. శ్రీరూర్, షికార్‌పూర్ పోలీస్ స్టేషన్లలో దోపిడీ, చోరీల కేసులు నమోదయ్యాయి. వృద్ధులకు లిఫ్ట్ ఇచ్చి, నిర్మానుష్య ప్రదేశాల్లో నగలు, డబ్బు దోచుకునే వ్యక్తిగా గతంలోనూ ఇతడిపై కేసులు నమోదయ్యాయి. 2020లో ఓ దోపిడీ కేసులో అరెస్టయి, ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించాడు.
రాందాస్ రాజకీయంగా కూడా చురుకుగా ఉండేవాడు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో పలువురు రాజకీయ నేతలతో కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గునాత్ గ్రామంలోని సంగర్ష్-ముక్తి సమితిలో సభ్యత్వం కోసం పోటీ చేసినా, ఓటమి చెందాడు. ప్రస్తుతం అతడిపై మరిన్ని కేసులు నమోదు చేసి, విచారణ చేపట్టినట్లు పోలీసులు ప్రకటించారు.