ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నూతన దిశానిర్దేశాలు ఇచ్చారు. గురువారం సచివాలయంలో జరిగిన నైపుణ్యాభివృద్ధి శాఖ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “యువతకు కేవలం శిక్షణ కాదు, ఉన్నత విద్యకు కూడా ప్రభుత్వం సహకరిస్తుంది. ‘నైపుణ్యం పోర్టల్’ రాష్ట్ర యువతకు ఉద్యోగ గేట్వేగా ఉండాలి” అని స్పష్టం చేశారు.
ప్రతి నియోజకవర్గంలో ప్రతి నెలా జాబ్ మేళాలు నిర్వహించాలని ఆయన అధికారులకు ఆదేశించారు. నవంబర్‌లో జరిగే పార్ట్నర్షిప్ సమ్మిట్లోగా నైపుణ్యం పోర్టల్‌ను ప్రారంభించాలని తెలిపారు. శిక్షణ పూర్తయ్యే ప్రతి అభ్యర్థికి స్కిల్ టెస్టింగ్, ధృవపత్రాల జారీ తప్పనిసరి చేయాలని సూచించారు.
మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, క్లస్టర్ ఆధారంగా శిక్షణలు అందించే ప్రయత్నం జరుగుతోందని, స్పేస్, ఆక్వా, క్వాంటం వంటి రంగాల్లో పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్య శిక్షణలు అందిస్తున్నామని వివరించారు. మొత్తం 15 క్లస్టర్ల ద్వారా పరిశ్రమలకు మానవ వనరులు అందించాలన్న లక్ష్యంతో పని చేస్తున్నట్టు తెలిపారు.
ముఖ్యమంత్రి అన్ని శాఖల డేటాను సమీకరించి నిజమైన నిరుద్యోగులను గుర్తించాలన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో జరిగిన జాబ్ మేళాల ద్వారా 1.44 లక్షల మందికి ఉద్యోగాలు లభించాయని అధికారులు వివరించారు. నైపుణ్యం పోర్టల్‌లో ఏఐ ఆధారిత రెజ్యూమ్ బిల్డర్, ఇంటర్వ్యూ సిమ్యులేటర్, వాట్సాప్ జాబ్ అలర్ట్స్ వంటి ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయని చెప్పారు.
విదేశీ ఉద్యోగ అవకాశాల కోసం యువతకు స్థానిక భాషల శిక్షణ ఇవ్వాలని సీఎం ఆదేశించారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌తో అనుసంధానం చేయాలని సూచించారు.
“నైపుణ్యం పోర్టల్ ద్వారా ఏ రంగంలో శిక్షణ కావాలో, ఏ ప్రాంతంలో జాబ్ మేళాలు జరుగుతున్నాయో, ఏ సంస్థల్లో ఉద్యోగ ఖాళీలు ఉన్నాయో అన్ని వివరాలు ఒకే చోట అందుబాటులో ఉండాలి. రాష్ట్ర యువత అంతా ఈ పోర్టల్ ద్వారా తమ భవిష్యత్తు రూపుదిద్దుకోవాలి” అని ముఖ్యమంత్రి అన్నారు.
