నందమూరి కుటుంబం నుంచి మరో వారసురాలు వినోద రంగంలో అడుగుపెట్టింది. నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని తొలిసారి కెమెరా ముందుకు వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ ‘సిద్ధార్థ ఫైన్ జ్యువెలర్స్’ ఆమెను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. ఈ ప్రకటనకు సంబంధించిన కమర్షియల్ యాడ్ వీడియో ఇప్పటికే విడుదలైంది.
తేజస్విని హుందాతనంతో, సంప్రదాయబద్ధమైన అందంతో అభిమానులను ఆకట్టుకున్నారు. ఇప్పటి వరకు తన తండ్రి సినిమాలకు సంబంధించిన నిర్మాణ పనుల్లో తెరవెనుక పనిచేసిన తేజస్విని, ఇప్పుడు స్వయంగా కెమెరా ముందుకు వచ్చారు. ‘సిద్ధార్థ ఫైన్ జ్యువెలర్స్’ ప్రతినిధులు ఆమె రూపం, వ్యక్తిత్వం తమ బ్రాండ్ విలువలకు సరిపోతుందని తెలిపారు.
ఈ యాడ్ చిత్రీకరణలో ప్రముఖ టెక్నీషియన్లు పనిచేశారు. దర్శకుడు వై. యమున కిషోర్ దర్శకత్వం వహించగా, కొరియోగ్రాఫర్ బృందా మాస్టర్ నృత్యరీతులు సమకూర్చారు. సంగీతం ఎస్.ఎస్. థమన్ అందించగా, ఛాయాగ్రహణం అయాంకా బోస్ చేశారు. మొత్తం యాడ్ చిత్రీకరణ వైభవంగా సాగి, సోషల్ మీడియాలో మంచి స్పందన తెచ్చుకుంటోంది.
తేజస్విని విశాఖపట్నం ఎంపీ మతుకుమల్లి భరత్ భార్య. ‘సిద్ధార్థ ఫైన్ జ్యువెలర్స్’ వ్యవస్థాపకులు నాగిని ప్రసాద్ వేమూరి, శ్రీమణి మతుకుమల్లి, శ్రీ దుర్గా కాట్రగడ్డ తేజస్విని భాగస్వామ్యంతో తమ బ్రాండ్ ప్రతిష్ఠ మరింత పెరుగుతుందని తెలిపారు.
ఈ యాడ్‌తో తేజస్విని తన వ్యక్తిత్వాన్ని, సొగసును కొత్తగా ఆవిష్కరించడమే కాకుండా, నందమూరి వారసురాలిగా ఒక ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు.
