దైనందిన అలవాట్లే మన గుండెను నాశనం చేస్తున్నాయా?


సాధారణంగా గుండె జబ్బులు వృద్ధులు లేదా అనారోగ్యవంతులకే పరిమితం అని అనుకుంటాం. కానీ, నిపుణులు హెచ్చరిస్తున్నారు – యువకులు, 50 సంవత్సరాల కన్నా తక్కువ వయసులో ఉన్నవారిలో కూడా గుండె సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి. దీని వెనుక జీవనశైలి, ఒత్తిడి, హార్మోన్ల మార్పులు ప్రధాన కారణాలు.

మనం రోజువారీగా చేసే కొన్ని అలవాట్లు గుండెకు ప్రమాదకరంగా మారుతున్నాయి.

1. దీర్ఘకాలిక నిద్రలేమి:
తగినంత నిద్ర లేకపోవడం వల్ల ఒత్తిడి హార్మోన్ల స్థాయిలు పెరుగుతాయి, రక్తపోటు అధికమవుతుంది, గుండెకు భారం పెరుగుతుంది. 8 గంటల నిద్ర తీసుకునేవారితో పోలిస్తే, 5 గంటలు లేదా అంతకంటే తక్కువ, 9 గంటలు లేదా అంతకంటే ఎక్కువ నిద్ర తీసుకునేవారిలో గుండె జబ్బుల ప్రమాదం ఎక్కువ.

2. అధిక స్క్రీన్ సమయం:
మొబైల్, టీవీ స్క్రీన్ల ముందు ఎక్కువ కూర్చోవడం కార్డియోమెటబోలిక్, కరోనరీ ఆర్టరీ వ్యాధులు, గుండె వైఫల్యం వంటి ప్రమాదాలను పెంచుతుంది. దీని కారణంగా ఒబెసిటీ వచ్చే అవకాశం, గుండెపై ఒత్తిడి పెరుగుతుంది.

3. అర్ధరాత్రి స్నాక్స్:
రాత్రి స్నాక్స్ తినడం, భోజనం మానేయడం, క్రమరహితంగా తినడం వల్ల ఇన్సులిన్ స్థాయిలు అస్తవ్యస్తమవుతాయి. ఫలితంగా బరువు, కొలెస్ట్రాల్ సమస్యలు, గుండె ఆరోగ్యానికి ప్రమాదం.

4. అధిక ఉప్పు:
ప్రాసెస్ చేసిన ఆహారం, రెస్టారెంట్ భోజనం, పచ్చళ్లు ద్వారా ఎక్కువ ఉప్పు తీసుకోవడం రక్తపోటు పెంచుతుంది, గుండె కండరాల పనితీరును కష్టతరం చేస్తుంది, హృదయ వైఫల్యానికి దారితీస్తుంది.

5. అధిక చక్కెర:
తీపి పదార్థాల అధిక వినియోగం ఇన్సులిన్ స్థాయిలను పెంచి రక్తపోటు, హార్ట్ బీట్ పెరగటానికి కారణం. గుండె సమస్యలు వచ్చే అవకాశాలను మరింత పెంచుతుంది.

6. పోషకాహారాలు లేకపోవడం:
ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, పండ్లు, కూరగాయలు తక్కువగా తీసుకోవడం ధమనుల గట్టిపడటానికి, గుండె సమస్యలకు కారణం. అధిక కొవ్వు, చక్కెర, రెడ్ మీట్ అధికంగా తీసుకోవడం గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది.

7. శారీరక శ్రమ లేకపోవడం:
కేవలం కూర్చుని ఉండడం రక్త ప్రసరణను తగ్గిస్తుంది, ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది, ప్లేక్ అభివృద్ధి చెందుతుంది. రోజూ కనీసం నడక, వ్యాయామం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

8. దీర్ఘకాలిక ఒత్తిడి:
అధిక ఒత్తిడి ధూమపానం, అతిగా తినడం, శారీరక చురుకుదనం లేకపోవడం వంటి అనారోగ్యకర అలవాట్లకు దారితీస్తుంది. ఫలితంగా రక్తపోటు, గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుంది.

గుండె ఆరోగ్యాన్ని కాపాడే మార్గాలు:

  • పోషక విలువలున్న ఆహారం తీసుకోవడం
  • రోజూ కనీసం 30 నిమిషాలు నడవడం
  • సమగ్రమైన, ప్రశాంతమైన నిద్ర
  • ఒత్తిడిని తగ్గించడం
  • 30 ఏళ్ల తరువాత క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు

గమనిక:
ఇక్కడ ఇచ్చిన సమాచారం అవగాహన కోసం మాత్రమే. వ్యక్తిగత వైద్యుల సలహా తీసుకోవడం అవసరం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *