ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా తన సత్తా చాటింది. ఒక్క మ్యాచ్ లోనూ టాస్ గెలవకుండానే, లీగ్ దశ నుంచి ఫైనల్ వరకూ అద్భుత ప్రదర్శన ఇచ్చి కప్ ను ముద్దాడింది. ఈ ఘన విజయానికి ప్రధాన కారణం ఎవరో చెప్పాలంటే… కెప్టెన్ రోహిత్ శర్మ ఒక ఆసక్తికరమైన పేరు బయటపెట్టాడు. మిడిలార్డర్ లో కీలక ఇన్నింగ్స్ లు ఆడిన శ్రేయస్ అయ్యర్ ను ‘సైలెంట్ హీరో’గా అభివర్ణించాడు.
టోర్నీలో పిచ్ లు మందకొడిగా ఉండడంతో బ్యాటింగ్ చేయడం సవాలుగా మారింది. అయితే, శ్రేయస్ అయ్యర్ తన శైలిలో నెమ్మదిగా, కానీ ధీటుగా రాణించాడు. లీగ్ దశలో పాకిస్థాన్ పై 56, న్యూజిలాండ్ పై 79 పరుగులతో అదరగొట్టాడు. సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై 45 పరుగులు చేసిన ఈ ముంబయి ఆటగాడు, ఫైనల్లో 48 పరుగుల విలువైన ఇన్నింగ్స్ ఆడాడు.
ఈ టోర్నమెంట్ మొత్తం అయ్యర్ జట్టు విజయాలకు నడిపించిన కీలక ఆటగాడు అని రోహిత్ వివరించాడు. “ఒక్కోసారి పరిస్థితులు అనుకూలించవు. అలాంటప్పుడు మన ఆటతీరు కీలకం. శ్రేయస్ అన్ని మ్యాచ్ లలో కీలక భాగస్వామ్యాలు నమోదు చేశాడు. అతడి ప్రదర్శన లేకపోతే, విజయం సులభం కాలేదని చెప్పొచ్చు” అని రోహిత్ పేర్కొన్నాడు.
శ్రేయస్ అయ్యర్ తన అద్భుత బ్యాటింగ్ తో టీమిండియా విజయంలో ముఖ్య పాత్ర పోషించాడు. అతని శాంతమైన, కాని ప్రభావవంతమైన ఆటతీరునే రోహిత్ శర్మ ‘సైలెంట్ హీరో’గా అభివర్ణించాడు. భారత జట్టు ఈ విజయంతో మరోసారి ఐసీసీ టోర్నీల్లో తన సత్తా నిరూపించుకుంది.