అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా ఏడవ రోజు వేటపాలెం ఎస్సై ఎం. వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో S.t Ann’s College నందు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా సాధికారత (Women Empowerment) మరియు మహిళా భద్రత (Women Safety) అంశాలపై ప్రత్యేక వీడియోల ప్రదర్శన జరిగింది. విద్యార్థినులకు, మహిళా సాధికారత ప్రాముఖ్యతను వివరించేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఎస్సై వెంకటేశ్వర్లు ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న నేరాలు, మోసాల గురించి వివరించారు. ఏవిధంగా అప్రమత్తంగా ఉండాలనే దానిపై స్పష్టమైన సూచనలు ఇచ్చారు. మహిళల భద్రతను పరిరక్షించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను విద్యార్థినులకు తెలియజేశారు. ఏవైనా అనుమానాస్పద సంఘటనలు ఎదురైతే తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మహిళల భద్రత కోసం ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఎస్సై నొక్కిచెప్పారు. మహిళలు ఆత్మస్థైర్యంతో ఉండాలని, ఎవరైనా మోసం చేయడానికి ప్రయత్నించినా చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చని వివరించారు. నేటి సమాజంలో మహిళలకు పూర్తి రక్షణ కల్పించేందుకు పోలీసులు కట్టుదిట్టమైన నిఘా ఉంచుతున్నారని తెలియజేశారు.
కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు. విద్యార్థినులు మహిళా సాధికారతపై చైతన్యంతో ముందుకెళ్లాలని ప్రిన్సిపాల్ సూచించారు. మహిళల భద్రత కోసం పోలీసులు నిర్వహించిన ఈ అవగాహన కార్యక్రమం విద్యార్థినులకు ఎంతో ఉపయోగకరంగా మారిందని పాల్గొన్న వారు అభిప్రాయపడ్డారు.