ఆరుగాలం కష్టపడి చెరుకు పండించినా గిట్టుబాటు ధర రాక, సకాలంలో చెల్లింపులు అందక రైతు తీవ్ర మనోవేదన చెందాడు. రొంగలి వెంకటరావు అనే రైతు తన 20 టన్నుల చెరుకు తోటకు నిరాశతో నిప్పంటించాడు. ప్రతి సంవత్సరం 60 టన్నుల చెరుకు చోడవరం చక్కెర కర్మాగారానికి సరఫరా చేస్తుంటానని, అయితే ఫ్యాక్టరీ పేమెంట్లు ఆలస్యం చేస్తుండటంతో తీవ్రంగా నష్టపోతున్నట్లు తెలిపారు.
చెరుకు పండించిన రైతులకు ఫ్యాక్టరీ యాజమాన్యం నష్టాన్ని మిగిలిస్తోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంట చేతికి వచ్చినా, కూలీల ఖర్చుతో తీయించి ఫ్యాక్టరీకి సరఫరా చేయాల్సి వస్తోందని, అయితే గిట్టుబాటు ధర రాక పెట్టుబడి కూడా తిరిగిరాదని వెంకటరావు ఆవేదన వ్యక్తం చేశారు. పైగా, ఫ్యాక్టరీ యాడ్లో చెరుకు నిల్వ ఉండిపోవడంతో రైతుల భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది.
ప్రతి ఏడాది కర్మాగారానికి చెరుకు సరఫరా చేసే రైతుల పరిస్థితి మరింత దారుణంగా మారుతోందని, రైతు కూలీలకు వెంటనే చెల్లింపులు జరగాలని వెంకటరావు డిమాండ్ చేశారు. కానీ ఫ్యాక్టరీ మాత్రం ఎప్పుడో డబ్బులు అకౌంట్లో వేస్తోందని, ఇది రైతులను అప్పుల పాలయ్యేలా చేసిందని ఆరోపించారు.
ఎంత శ్రమించినా లాభం లేకుండా పోవడంతో, చివరకు తాను పండించిన చెరుకు తోటనే తానే తగలబెట్టాల్సి వచ్చిందని వెంకటరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ, ప్రభుత్వ సమక్షంలో తక్షణమే పరిష్కారం తీసుకురావాలని డిమాండ్ చేశారు.