రాష్ట్ర యువతకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ), ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం నేర్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మైక్రోసాఫ్ట్‌తో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. అమరావతి సచివాలయంలో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు, ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అధికారులు ఎంఓయుపై సంతకాలు చేశారు.
ఈ ఒప్పందం ప్రకారం, మైక్రోసాఫ్ట్ సంస్థ ఒక ఏడాది వ్యవధిలో 2 లక్షల మందికి ఎఐ, క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ ప్రొడక్టివిటీ వంటి అంశాల్లో శిక్షణ అందించనుంది. రాష్ట్రంలోని 50 గ్రామీణ ఇంజనీరింగ్ కాలేజీల్లో 500 మంది అధ్యాపకులు, 10 వేల మంది విద్యార్థులకు మైక్రోసాఫ్ట్ ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది. అలాగే, 30 ఐటిఐలలో 30 వేల మంది విద్యార్థులకు డిజిటల్ స్కిల్స్‌పై శిక్షణ అందించనుంది.
పాస్ పోర్ట్ టు ఎర్నింగ్ 2.0 ప్రోగ్రాం కింద యునిసెఫ్ భాగస్వామ్యంతో 40 వేల మందికి, కేంద్ర కార్మిక-ఉపాధి మంత్రిత్వ శాఖ సహకారంతో మరో 20 వేల మందికి ఎఐ నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వనున్నారు. అంతేకాక, ప్రభుత్వ సేవలను మెరుగుపరిచేందుకు 50 వేల మంది ప్రభుత్వ సిబ్బందికి 100 గంటలపాటు ఎఐ శిక్షణ ఇవ్వనున్నారు.
ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండి గణేష్ కుమార్, మైక్రోసాఫ్ట్ సౌత్ హెడ్ దినేష్ కనకమేడల, మైక్రోసాఫ్ట్ ఇండియా-సౌత్ ఏషియా డైరెక్టర్ సందీప్ బంద్వేద్కర్ తదితరులు పాల్గొన్నారు. విద్యాసంస్థల్లో ఎఐ పాఠ్యాంశాలను ప్రవేశపెట్టేందుకు అవసరమైన శిక్షణ, సర్టిఫికేషన్‌ను మైక్రోసాఫ్ట్ అందించనుందని మంత్రి లోకేష్ తెలిపారు.