ఆప్కాస్ రద్దు చేస్తే మున్సిపల్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ డిమాండ్ చేసింది. పార్వతీపురం మన్యం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. కూటమి ప్రభుత్వం కార్మికుల పట్ల చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని, కాంట్రాక్టర్ల చేతుల్లోకి కార్మికులను నెట్టకూడదని హెచ్చరించారు.
నాయకత్వం మాట్లాడుతూ, గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకొచ్చిన 279 జీవోపై తీవ్రంగా పోరాడామని గుర్తు చేశారు. ప్రస్తుతం ఆప్కాస్ రద్దు చేస్తున్న ప్రభుత్వం కార్మికులకు మరింత మెరుగైన జీవన విధానాన్ని కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. రెగ్యులర్ ఉద్యోగాల్లోకి మారేలా చర్యలు తీసుకోవాలని, కాంట్రాక్టర్ల ఆధీనంలో మళ్లీ కార్మికులను ఉంచాలనే ప్రయత్నాన్ని సహించబోమని స్పష్టం చేశారు.
సాలూరులో కార్మికులకు జీతాలు ఆలస్యమవుతున్నాయని, ఫిబ్రవరి నెల జీతాలు ఇప్పటికీ ఖాతాల్లో జమ కాలేదని సభ్యులు తెలిపారు. నూనె, చెప్పుల కోసం నిధులు లేకపోవడం, చనిపోయిన కార్మికుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇప్పటివరకు రావడం దారుణమని అన్నారు. జీవో నెంబర్ 36 అమలు చేసి ఇంజనీరింగ్ కార్మికులకు వేతనాలు పెంచాలని, డ్రైవర్ల వేతనాలను కూడా జీవో ప్రకారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
శ్యామలంబ పండుగ సందర్భంగా కార్మికులకు సెలవులు మంజూరు చేయాలని, పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ జిల్లా నాయకులు మల్లేష్, సింహాచలం, రాముడు, శంకరు, మహిళా కమిటీ సభ్యులు ఇందు, నిర్మల, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు దావాలా రమణారావు, కోశాధికారి సన్యాసిరావు, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.