వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని అమలాపురంలో ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ ఆధ్వర్యంలో పార్టీ జెండా ఆవిష్కరించి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ఈ వేడుకలకు జిల్లా వైయస్సార్సీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. హైస్కూల్ సెంటర్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
ప్రస్తుత ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ పార్టీ నాయకులు విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా ‘అమ్మ ఒడి’, ‘సూపర్ సిక్స్’ వంటి పథకాలు ప్రజలకు ఉపయోగపడేలా అమలు చేయలేదని వైయస్సార్సీపీ నేతలు ఆరోపించారు. విద్యార్థులు, యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెంచాలని డిమాండ్ చేశారు.
కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్న నేతలు ప్రభుత్వ వైఫల్యాలపై గళమెత్తారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయని ప్రభుత్వం ఇకపై ఓటుతో తగిన బుద్ధి చెప్పాలని హితవు పలికారు. రాబోయే రోజుల్లో యువత, విద్యార్థులు ప్రభుత్వానికి సరైన సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని రామచంద్రపురం నాయకుడు పిల్లి సూర్యప్రకాశ్ అన్నారు.
ఈ కార్యక్రమంలో చిర్ల జగ్గారెడ్డి, పొన్నాడ వెంకట సతీష్ కుమార్, గొల్లపల్లి సూర్యరావు, జడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, పి.గన్నవరం ఇంచార్జి గన్నవరపు శ్రీనివాసరావు, చెల్లుబోయిన శ్రీనివాస్, యువత నాయకులు ఎం. శిరీస్, తోట గౌతమ్, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.