సినిమా ఫంక్షన్ వేదికపై సరదాగా మాట్లాడిన మాటలను వైసీపీ సోషల్ మీడియా గ్రూపులు తప్పుగా అనువదించాయి. తాను ఎవరినీ ఉద్దేశించి మాట్లాడలేదని, ప్రేక్షకులను నవ్వించడానికే ఆ మాటలు అన్నానని నటుడు స్పష్టం చేశాడు. కానీ వైసీపీ అనుచరులు తనపై దుష్ప్రచారం చేయడం ప్రారంభించారని వాపోయాడు.
గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో తీవ్ర వేధింపులకు గురయ్యానని తెలిపారు. వైసీపీ సోషల్ మీడియా గ్రూపులు తన ఫోన్ నెంబర్ షేర్ చేసి దాదాపు 1800 కాల్స్ వచ్చాయి. తన భార్యను, తల్లిని, పిల్లలను కూడా తిట్టించారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంతటితో ఆగకుండా, తాను ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి ఏర్పడిందని వెల్లడించారు.
ఇటీవల “అనిల్” అనే వ్యక్తి తనపై ఫేక్ పోస్టులు పెట్టినట్లు ఆధారాలతో సహా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశానని అన్నారు. సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న దాడుల గురించి హోంమంత్రి వద్ద ఫిర్యాదు చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. త్వరలోనే ప్రభుత్వానికి ఇది చేరువ చేస్తానని స్పష్టం చేశారు.
తన పరువు ప్రతిష్టలకు తీవ్రంగా భంగం కలిగించారని, దీనిపై కోటి రూపాయల పరువునష్టం దావా వేస్తానని ప్రకటించారు. ఇలాంటి దుష్ప్రచారాలను ఎదుర్కొనేందుకు న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు. సోషల్ మీడియా అబద్ధపు ప్రచారాలను అడ్డుకోవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.