పండుగలో గొడవ, దుర్మార్గమైన హత్య
నర్సీపట్నం మున్సిపాలిటీ అయ్యన్నకాలనీలో ఈ నెల 8న తలుపులమ్మ తల్లి పండుగ సందర్భంగా స్టేజీ ప్రోగ్రాం జరుగుతున్న సమయంలో రుత్తల దుర్గాప్రసాద్ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి డ్యాన్స్ చేస్తుండగా నిందితుడు చిత్రాడ మహేష్ తో చిన్నపాటి గొడవ జరిగింది. పోలీసుల జోక్యంతో ఆ గొడవ తాత్కాలికంగా ముగిసినప్పటికీ, మహేష్ మాత్రం దురభిప్రాయంతో హత్యకు పాల్పడేందుకు సిద్ధమయ్యాడు.
చాకుతో దాడి, మృతి చెందిన దుర్గాప్రసాద్
ఘటన జరిగిన రాత్రి ఒంటి గంట సమయంలో మహేష్ తన ఇంట్లో నుంచి చాకును తీసుకొని రుత్తల దుర్గాప్రసాద్ అన్నయ్య ఇంటి వద్దకు వెళ్లాడు. అక్కడ దుర్గాప్రసాద్ స్నేహితులతో మాట్లాడుతున్న సమయంలో అతనిపై అసభ్య పదజాలంతో దూషించి, మూడు సార్లు ఎడమ చాతి భాగంలో పొడిచాడు. అతన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన స్నేహితుడు షణ్ముక సాయిని కూడా కడుపు, తోడ భాగాల్లో గాయపరిచాడు.
ఆసుపత్రికి తరలింపు, కానీ ప్రాణాలు నిలవలేదు
దాడికి గురైన దుర్గాప్రసాద్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించినా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనపై మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు నర్సీపట్నం డీఎస్పీ పీ. శ్రీనివాసరావు తెలిపారు. దాడిలో గాయపడిన షణ్ముక సాయి పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉందని పోలీసులు చెప్పారు.
నిందితుడి అరెస్ట్, రౌడీషీట్ నమోదు
నిందితుడు చిత్రాడ మహేష్‌ను గురువారం నర్సీపట్నం మున్సిపాలిటీ అయ్యన్నకాలనీ వద్ద అరెస్టు చేశారు. అతని వద్ద చాకును స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. మహేష్‌పై గతంలోనూ నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్‌లో పాత కేసు ఉందని, ప్రస్తుతం రౌడీషీట్ కూడా తెరుస్తామని డీఎస్పీ వెల్లడించారు. ఈ హత్య ఘటన నర్సీపట్నంలో తీవ్ర కలకలం రేపింది.
