ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో ప్రపంచంలోనే అత్యంత పలుచనైన ఫోల్డబుల్ ఫోన్ ‘ఫైండ్ ఎన్5’ను విడుదల చేసింది. ముడిచినప్పుడు ఈ ఫోన్ మందం కేవలం 8.93 మిల్లీమీటర్లు మాత్రమే, తెరిచినప్పుడు అత్యంత పలుచనైన పాయింట్ వద్ద 4.21 మిల్లీమీటర్లు ఉంటుంది. 2024లో విడుదలైన ‘ఆనర్ మేజిక్ వీ3’ కంటే సన్నగా ఉండటంతో, ఒప్పో తన ఫోన్‌ను ప్రపంచంలోనే అత్యంత పలుచనైనదిగా ప్రకటించింది. అయితే, తెరిచినప్పుడు ‘హువావే మేట్ ఎక్స్‌టీ’ ట్రిపుల్ ఫోల్డబుల్ ఫోన్ 3.6 మిల్లీమీటర్ల మందంతో మరింత సన్నగా ఉంటుందని సంస్థ పేర్కొంది.
ఈ ఫోన్ 6.62 అంగుళాల ఫుల్ హెచ్డీ అమోలెడ్ స్క్రీన్, 8.1 అంగుళాల 2కే ఎక్స్టర్నల్ డిస్ప్లేతో విడుదలైంది. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 2160 హెర్ట్జ్ పీడ్ల్యూఎం డిమ్మింగ్‌తో స్క్రీన్‌ను తీర్చిదిద్దారు. స్టైలస్ పెన్కు అనుకూలంగా ఉండేలా రూపొందించబడిన ఈ ఫోన్, ఐపీఎక్స్6, ఐపీఎక్స్9 రేటింగ్‌లతో వస్తుంది. దీని వల్ల ఇది పూర్తిగా వాటర్‌ప్రూఫ్‌గా ఉండటమే కాకుండా, ధూళి, మట్టికణాల నుండి రక్షణ కలిగి ఉంటుంది. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో 16 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజీ కలిగి ఉంది.
ఒప్పో ఫైండ్ ఎన్5 ఫోన్ 50 మెగాపిక్సల్ హాసెల్‌బ్లాండ్ బ్రాండెడ్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. సెల్ఫీ కోసం రెండు కెమెరాలు అమర్చారు—ఒకటి తెరిచినప్పుడు, మరొకటి ముడిచినప్పుడు ఉపయోగించడానికి. బ్యాటరీ సామర్థ్యం 5,600 ఎంఏహెచ్ కాగా, 80 వాట్స్ వైర్డ్ చార్జింగ్, 50 వాట్స్ వైర్లెస్ చార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. కలర్ ఓఎస్ లేయర్‌తో ఆండ్రాయిడ్ 15 లోడెడ్‌గా వస్తుంది.
ఈ ఫోన్ యూరోపియన్, ఆసియా మార్కెట్లలో విడుదల కానుంది. అయితే, ఒప్పో ఇప్పటివరకు తన ‘ఫైండ్ ఎన్’ సిరీస్‌ను ఇండియన్ మార్కెట్లో అందుబాటులోకి తేలేదు. ఫైండ్ ఎన్5 ఫోన్ ధర దాదాపు 1.62 లక్షలుగా ఉండే అవకాశం ఉంది. మిస్టీ వైట్, కాస్మిక్ బ్లాక్, డస్కీ పర్పుల్ రంగుల్లో లభించనుంది.