తొలి వన్డే ప్రపంచకప్‌ను సాధించి చరిత్ర సృష్టించిన భారత మహిళా క్రికెట్ జట్టు సభ్యులు గురువారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలిశారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ భేటీలో ప్రపంచకప్‌తో మెరిసిన టీమ్‌ఇండియా మహిళలను రాష్ట్రపతి అభినందించారు.
ద్రౌపదీ ముర్ము మాట్లాడుతూ, “మన అమ్మాయిల జట్టు భారత మహిళా క్రికెట్‌ను భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందనే నమ్మకం ఉంది. మీరు ఎన్నో కఠిన సవాళ్లను ఎదుర్కొని, ఈ స్థాయికి చేరడం గొప్ప విషయం.
ఈ విజయం కోట్లాది భారతీయుల గర్వకారణం. జట్టులోని సభ్యులు విభిన్న ప్రాంతాలు, పరిస్థితులు, సామాజిక నేపథ్యాలు కలిగి ఉన్నప్పటికీ సమష్టిగా విజయం సాధించడం ప్రేరణాత్మకం” అని ఆమె పేర్కొన్నారు.
Also Read:పాత రాయల్ చెరువుకు గండి – గ్రామాల్లో నీటి ప్రవాహం, రైతుల్లో ఆందోళన
ఈ సందర్భంగా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ రాష్ట్రపతికి జట్టు సభ్యుల సంతకాలతో కూడిన జెర్సీని బహూకరించింది. మహిళా క్రికెటర్లతో రాష్ట్రపతి ముచ్చటిస్తూ, వారి కృషి, నిబద్ధతను ప్రశంసించారు.
ఇక గత రోజు భారత మహిళల జట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా కలిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాని జట్టు విజయాన్ని ప్రశంసిస్తూ, ఫిట్ ఇండియా సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించాల్సిన అవసరాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.
