ఉత్తరప్రదేశ్ హాపూర్‌లోని చిజార్సి టోల్ ప్లాజా వద్ద ఓ మహిళ చేసిన వీరంగం అందరినీ షాక్‌కు గురి చేసింది. తన ఫాస్టాగ్ ఖాతాలో డబ్బులు లేకపోవడంతో టోల్ సిబ్బంది నగదు చెల్లించమని అడగగా ఆమె ఆగ్రహంతో విరుచుకుపడింది. దీంతో ఉద్యోగి అసహ్యంగా కొట్టించుకున్నాడు.
వివాదం వెంటనే ఘర్షణగా మారింది. మహిళ నేరుగా బూత్‌లోకి వెళ్లి, ఉద్యోగిపై చెంపదెబ్బల వర్షం కురిపించింది. అక్కడున్న ఇతర వాహనదారులు ఈ దృశ్యాన్ని చూస్తూ ఆశ్చర్యపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఎవరో ఒకరు రికార్డ్ చేయగా, అది సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది.
వీడియోలో 4 సెకన్లలోనే 7 చెంపదెబ్బలు విసురుతూ మహిళ ఎలా రెచ్చిపోయిందో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఘటనపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. “ఇది యాక్షన్ సినిమాను మించిపోయింది” అని ఒకరు కామెంట్ చేయగా, మరొకరు “ఇది కొత్త టోల్ చెల్లింపు పద్ధతా?” అంటూ వ్యంగ్యంగా స్పందించారు.
మహిళ కారులో ఘజియాబాద్ నుంచి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం పోలీసులు విచారణ చేపట్టారు. బాధిత ఉద్యోగి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. మహిళపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.