భారత్-ఆస్ట్రేలియా మధ్య నవంబర్ 22న మొదలుకానున్న తొలి టెస్ట్ కోసం రోహిత్ శర్మ అందుబాటులో ఉంటాడా లేదా అనే విషయంపై ఉత్కంఠ కొనసాగుతోంది. రోహిత్ వ్యక్తిగత కారణాలతో తొలుత తొలీ టెస్ట్‌కి దూరంగా ఉండాలని భావించినప్పటికీ, ఇప్పుడు తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు సమాచారం. నవంబర్ 10న అతను తొలి బ్యాచ్‌లో కొంతమంది ఆటగాళ్లతో కలిసి ఆస్ట్రేలియాకు పయనమవుతాడని ఇండియా టుడే కథనం తెలిపింది.
రోహిత్ తొలి టెస్ట్ సమయంలో జట్టుతో ఉండనున్నప్పటికీ, మ్యాచ్‌లో ఆడతాడా లేదా అనేది ఇంకా స్పష్టత లేదు. అతని భార్య రితికా ప్రస్తుతం నిండు గర్భిణి కావడంతో, డెలివరీ సమయానికి రోహిత్ తన కుటుంబానికి దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐకి ముందే తెలియజేశాడు.
ఈ నేపథ్యంలో, టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కీలకమైన మ్యాచ్‌లో రోహిత్ తప్పక ఆడాలని అభిప్రాయపడ్డాడు. మొదటి మ్యాచ్ మిస్ చేస్తే సిరీస్ మొత్తం బుమ్రాను కెప్టెన్‌గా ఉంచాలని కూడా ఆయన సూచించాడు.