కర్నూలు జిల్లా ఆదోని డివిజన్లోని కోసీగి మండలానికి చెందిన శిరీష కొన్ని సంవత్సరాల క్రితం ప్రేమ పెళ్లి చేసుకుంది. భర్త మద్యం కు బానిసై అనారోగ్యంతో మరణించాడని ఆమె తెలిపారు. భర్త మృతితో తన పుట్టింటికి చేరుకోవాల్సి వచ్చిందని పేర్కొంది. అయితే భర్త ఆస్తిపై హక్కు కోరుతున్నందున బంధువులు తనను టార్గెట్ చేశారని వాపోయింది.
భర్త వారింటివారు ఆస్తి విషయంలో తనను, పిల్లలను అడ్డుగా చూస్తున్నారని శిరీష ఆరోపించారు. ఈ క్రమంలో బావ నరసింహులు, మరిది హరి, ఆడపడుచు భర్త కలిసి తన ఇంటిపై దాడి చేశారని తెలిపారు. కర్రలు, ఇనుప రాడ్లతో తమను హింసించారని, తన తమ్ముడికి తీవ్ర గాయాలు అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.
తనకు ప్రాణహాని ఉందని, పిల్లలను కూడా చంపేస్తామని బంధువులు బెదిరించారని శిరీష తెలిపారు. భర్త ఆస్తిని లాక్కొనడమే వారి ఉద్దేశమని వాపోయారు. తాను పోలీసులను ఆశ్రయించినప్పటికీ, తనకు తగిన రక్షణ కల్పించాలని కోరారు.
ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు శిరీష తెలిపారు. దాడి చేసిన బంధువులపై కఠిన చర్యలు తీసుకోవాలని, తన పిల్లలకు రక్షణ కల్పించాలని పోలీసులను వేడుకున్నారు. తమకు న్యాయం చేయాలని బాధితురాలు రోదిస్తూ పేర్కొన్నారు.

 
				 
				
			 
				
			 
				
			