పోప్‌గా ఎన్నికైన వెంటనే తమ అసలు పేరును త్యజించడం ఒక ప్రత్యేక సంప్రదాయం. ఇది దాదాపు వెయ్యి సంవత్సరాలుగా కొనసాగుతున్న ఆచారం. ప్రస్తుతం కన్నుమూసిన పోప్ ఫ్రాన్సిస్ అసలు పేరు జోర్జ్ మారియో బెర్గోగ్లియో కాగా, పోప్‌గా ఎంపికైన తర్వాత ఫ్రాన్సిస్ అనే పేరును స్వీకరించారు. ఇలా చేయడం కొత్త బాధ్యత ప్రారంభానికి గుర్తుగా భావించబడుతుంది. పోప్‌గా ఎంపిక కేవలం పదవికి మాత్రమే కాకుండా, విశ్వమత గురువుగా ఒక కొత్త పాత్రను స్వీకరించడం అని భావిస్తారు.
ఈ సంప్రదాయం క్రీస్తుశకం 533–535 మధ్య పోప్‌గా ఉన్న జాన్ 2తో ప్రారంభమైంది. ఆయన అసలు పేరు మెర్క్యురియస్. ఇది ఒక రోమన్ దేవత పేరు కావడంతో, క్రైస్తవ మతానికి విరుద్ధమని భావించి, ‘జాన్’ అనే పేరును ఎంచుకున్నారు. అప్పటి నుంచి అనేకమంది పోప్‌లు తమకు ఆదర్శంగా నిలిచిన సెయింట్‌ల పేర్లు లేదా వారి మతపరమైన స్పూర్తినిచ్చిన వ్యక్తుల పేర్లను ఎంచుకుంటూ వస్తున్నారు. 16వ శతాబ్దం నాటికి ఇది ఒక కట్టుబాటుగా మారిపోయింది.
పోప్‌లు కేవలం మతపరమైన నాయకులు మాత్రమే కాదు. వారు వాటికన్ సిటీ అనే స్వతంత్ర దేశానికి అధిపతులు కూడా. ప్రపంచ దేశాలతో దౌత్య సంబంధాలు నిర్వహించడంలోనూ, అంతర్జాతీయ శాంతికి వంతు వేసే ప్రయత్నాల్లోనూ పోప్‌ల పాత్ర కీలకం. ఉదాహరణకు, పోప్ ఫ్రాన్సిస్ అమెరికా-క్యూబా మధ్య సంబంధాల పునరుద్ధరణలో ముఖ్యపాత్ర పోషించారు. అంతేకాదు, యుద్ధాల నివారణ, వలసలు, పర్యావరణ పరిరక్షణ వంటి సమకాలీన సమస్యలపై కూడా పోప్‌లు తమ గళాన్ని వినిపిస్తున్నారు.
ఈ పేరుమార్పు సంప్రదాయం ఒక్క మత పరమైన బాధ్యతకి మాత్రమే కాకుండా, గ్లోబల్ నాయకత్వానికి సంకేతంగా మారింది. ఒక కొత్త పేరు, ఒక కొత్త దిశలో పోప్ ప్రయాణం ప్రారంభమవుతుందని భావిస్తారు. ఇది ప్రజలకు స్పష్టమైన సంకేతం — ఈ వ్యక్తి ఇప్పుడు ప్రపంచ క్యాథలిక్ సంఘానికి సంపూర్ణంగా అంకితమయ్యాడని. పోప్ పేరులోని ప్రతి అర్థం ఆయన కార్యచరణకు ఒక మార్గదర్శకంగా ఉంటుంది.

 
				 
				
			 
				 
				