టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు గిరిజన సంఘాల ఆగ్రహానికి కారణమయ్యాయి. ఇటీవల ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు గిరిజనులను కించపరిచినట్లు భావించిన గిరిజన సంఘాలు, తక్షణ క్షమాపణ కోరుతూ ఉద్యమ బాట పడుతున్నాయి. ఆయన వ్యాఖ్యలు తమను హేళన చేస్తున్నాయని మండిపడుతున్నారు.
వివరాల్లోకి వెళితే, తమిళ నటుడు సూర్య నటించిన సినిమాలోని ఒక అంశాన్ని ప్రస్తావిస్తూ విజయ్ మాట్లాడుతూ, “కశ్మీర్‌లో ఉగ్రవాదులు దాడులు చేస్తున్న విధానం, 500 ఏళ్ల క్రితం ట్రైబల్స్ ఘర్షణలకు పోలికగా ఉంది” అనే మాటలే వివాదానికి దారితీశాయి. ‘ట్రైబల్స్’ అనే పదాన్ని ఈ సందర్భంలో వాడటం అప్రస్తుతమని, ఇది గిరిజనుల మనోభావాలను దెబ్బతీసిందని వారు ఆరోపిస్తున్నారు.
గతాన్ని ఉదహరిస్తూ, ఉగ్రవాద చర్యలతో గిరిజన ఉద్యమాలను పోల్చడం తమను కించపరచడమేనని గిరిజన సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. గిరిజనుల అభివృద్ధి, ఉద్యమాల వెనుక ఉన్న చరిత్రను తక్కువ చేస్తూ చేసిన వ్యాఖ్యలు బాధాకరమని వారు పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా గిరిజన సంఘాలు ఖండన చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరిస్తున్నారు. ఈ వివాదంపై విజయ్ ఎలా స్పందిస్తారో అందరి దృష్టి ప్రస్తుతం అక్కడే కేంద్రీకృతమైంది.