విక్టరీ వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడం, ఫెస్టివ్ సీజన్లో రావడంతో సినిమా హౌస్‌ఫుల్ షోస్‌తో కొనసాగుతోంది.
తాజా సమాచారం ప్రకారం, ఈ మూవీ మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 106 కోట్లు గ్రాస్ కలెక్షన్ సాధించింది. విడుదల రోజు వరల్డ్ వైడ్‌గా రూ. 45 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా, రెండో రోజు రూ. 77 కోట్ల మార్కును దాటి, మూడో రోజుకు వంద కోట్ల క్లబ్‌లోకి చేరింది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు.
ఈ విజయాన్ని అభిమానులు సోషల్ మీడియాలో వేడుకలా మార్చేశారు. “ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్.. విక్టరీ వెంకటేశ్!” అంటూ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. సినిమా పాటలు కూడా మంచి విజయాన్ని సాధించాయి. భీమ్స్ అందించిన మ్యూజిక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ సినిమాలో ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పించడంలో ఈ చిత్రం సక్సెస్ సాధించింది. సంక్రాంతి బరిలో నిలిచిన ఇతర సినిమాలతో పోటీ పడుతూ ఈ మూవీ భారీ వసూళ్లతో రికార్డులు సృష్టిస్తోంది.