వైసీపీ నేత వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టులో నిరాశ ఎదురైంది. స్థలం ఆక్రమణ కేసులో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు ఈ రోజు విచారణ జరిపింది. అయితే కేసుకు సంబంధించి ప్రభుత్వ ఆదేశాలు అవసరమని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలియజేయడంతో, హైకోర్టు కేసు విచారణను వారం రోజుల పాటు వాయిదా వేసింది.
ప్రస్తుతం వంశీ విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. స్థల ఆక్రమణ కేసుతో పాటు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడికి సంబంధించిన కేసు కూడా ఆయనపై నమోదు అయ్యింది. ఈ కేసుల్లో ఆరోపణలతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.
ఇంకా, సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో కూడా వంశీపై కేసు నమోదై ఉంది. ఈ కేసులోనూ ఆయనపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఈ మూడూ కేసులు ప్రస్తుతం విచారణలో ఉన్నాయని, ప్రతి కేసులో వంశీ జైలులోనే ఉన్నారు. అన్ని కేసులపై సమగ్ర విచారణ అనంతరం తదుపరి నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో వంశీకి ఈసారి బెయిల్ రాకపోవడంతో ఆయన న్యాయపరమైన చిక్కుల్లో మరింత దిగజారినట్లు కనిపిస్తోంది. కోర్టులో ఆయన తరఫున న్యాయవాదులు వినిపించిన వాదనలు ఈ దశలో ఫలించకపోవడం వంశీకి పెద్ద ఎదురు దెబ్బగానే భావించబడుతోంది.
