అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలవడంతో తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం వడ్లూరు గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. వడ్లూరు ఉష చిలుకూరి పూర్వీకుల గ్రామమని, ఆమె అగ్రరాజ్యానికి ఉపాధ్యక్షురాలిగా వ్యవహరించనున్నందున గ్రామస్థులు ఎంతో గర్వంగా భావిస్తున్నారు. ట్రంప్ గెలుపుతో పాటు, వారి బంధువు ఉష చిలుకూరి ఇక్కడి వారని గ్రామస్థులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి స్వీట్లు పంచుకున్నారు.
గ్రామంలో ఉష తాత రామశాస్త్రి బంధువులు ఇప్పటికీ నివాసముంటున్నారు. గ్రామానికి 20 సెంట్ల స్థలాన్ని చిలుకూరి కుటుంబం దానంగా ఇచ్చిందని, అక్కడ సాయిబాబా ఆలయం, కల్యాణ మండపం నిర్మించారని మాజీ సర్పంచి పెనుమత్స శ్రీనివాసరాజు తెలిపారు. గ్రామస్థులు ఉష తమ పూర్వీకుల గ్రామానికి సాయం చేస్తే బాగుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
గ్రామానికి ఉష రాలేదని, కానీ ఆమె తండ్రి రాధాకృష్ణ మూడు సంవత్సరాల క్రితం సందర్శించినట్లు పూజారి చెప్పారు. ఆ సమయంలో ఆలయాన్ని, గ్రామ పరిస్థితిని పరిశీలించిన ఆయన, తల్లి మట్టిని గుర్తుంచుకున్నారని గ్రామస్థులు తెలిపారు.

 
				 
				
			 
				
			 
				
			