కడప జిల్లా గోపవరం మండలం ప్రాజెక్టు కాలనీ సమీపంలోని సెంచురీ ప్లైవుడ్ ఫ్యాక్టరీలో భారీ మోసం యత్నాన్ని బద్వేలు రూరల్ పోలీసులు అడ్డుకున్నారు. పైన్ లాజిస్టిక్స్ ట్రాన్స్ పోర్ట్ అనే నకిలీ పేరుతో ఆకుల మహేష్, పూంగవనం శివకుమార్ అనే ఇద్దరు వ్యక్తులు కలకత్తాకు పంపాల్సిన ఎండీఎఫ్ బోర్డులను అక్రమంగా అపహరించేందుకు కుట్ర రచించారు.
ఈ మోసం విషయం కంపెనీ ప్రతినిధులకు అనుమానం వచ్చి, వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బద్వేలు రూరల్ సీఐ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి దాదాపు రూ.5 లక్షల విలువగల 12,000 కేజీల ఎండీఎఫ్ బోర్డులను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల విచారణలో నిందితుల మోసపూరిత ప్లాన్ బయటపడింది. వారు నకిలీ ధృవీకరణ పత్రాలు ఉపయోగించి సరుకు రవాణా చేస్తున్నట్లు తేలింది. నిజానికి వారికి ఫ్యాక్టరీతో ఎలాంటి సంబంధం లేదని పోలీసుల విచారణలో స్పష్టం అయింది. ఈ మోసం ద్వారా కంపెనీకి భారీ నష్టం కలగే అవకాశం ఉండేది.
ఇక ఈ ఇద్దరు నిందితులపై నెల్లూరు జిల్లా ముత్తుకూరు పోలీస్ స్టేషన్ లో కూడా ఇదే తరహా మోసపు కేసు నమోదైందని బద్వేలు రూరల్ సీఐ తెలిపారు. నిందితులపై మరిన్ని కేసులు ఉన్నాయా అన్న దానిపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది. పోలీసులు వారు చేసిన మోసాలను బహిర్గతం చేస్తామని తెలిపారు.

 
				 
				
			 
				
			 
				
			