తుడుం దెబ్బ రాష్ట్ర కోకన్వీనర్ గోడం గణేష్ నేతృత్వంలో ఆదిలాబాద్ జిల్లా మవల మండలంలోని కొమురం భీమ్ కాలనీలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌పై చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమిత్ షా రాజీనామా చేసి బేషరత్తుగా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
గోడం గణేష్ మాట్లాడుతూ, “అంబేద్కర్ మహానీయుడు, రాజ్యాంగ నిర్మాత. ఆయనను అవమానపరిచే వ్యాఖ్యలు బీజేపీ నాయకుల దురహంకారానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. అంబేద్కర్ చేసిన రాజ్యాంగం వల్లనే కోట్లాది బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఈ దేశంలో హక్కులు పొందారు” అని అన్నారు. దేశ ప్రజల కోసం అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని కించపరిచేలా మాట్లాడటం సరికాదని, వెంటనే అమిత్ షా తన పదవికి రాజీనామా చేయాలని స్పష్టం చేశారు.
బీజేపీతో పాటు ఇతర రాజకీయ పార్టీలు అంబేద్కర్ భావజాలానికి వ్యతిరేకంగా ఉంటాయని గోడం గణేష్ ఆరోపించారు. అంబేద్కర్ అందించిన రాజ్యాంగం వల్ల అణగారిన వర్గాలు అభివృద్ధి చెందుతున్నాయని, దాన్ని కించపరిచే ప్రయత్నాలను ప్రజలు తట్టుకోరని తెలిపారు. అంబేద్కర్ పేరును చిన్నబుచ్చే వ్యాఖ్యలను ఖండిస్తూ, న్యాయమైన పోరాటం చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో దళిత, బహుజన నాయకులు, వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అమిత్ షా క్షమాపణ చెప్పకపోతే అన్ని వర్గాల ప్రజలతో కలిసి పెద్ద ప్రజా ఉద్యమాన్ని చేపడతామని గోడం గణేష్ హెచ్చరించారు. ఈ సమావేశంలో వెట్టి మనోజ్, తోడసం ప్రకాష్, శివరాం చరణ్ తదితరులు పాల్గొన్నారు.