తిరుమల తిరుపతిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన టీటీడీ ఈవో జె. శ్యామలరావు, గత ఐదేళ్లలో టీటీడీలో అనేక అవకతవకలు, నిర్లక్ష్యం చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా గోశాల నిర్వహణ, ఐటీ విభాగం, కొనుగోళ్లలో జరిగిన అక్రమాలను ఆధారాలతో సహా వివరించారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు టీటీడీలో వ్యవస్థల ప్రక్షాళన చర్యలు ప్రారంభించామన్నారు.
గోశాలల్లో దుర్వ్యవస్థను గత ప్రభుత్వ హయాంలో జరిగినదిగా స్పష్టం చేశారు. గోవులకు నాచుపట్టిన నీరు, పురుగులతో ఉన్న దాణా ఇచ్చినట్లు, గడువు తీరిన మందులు వాడినట్లు తెలిపారు. మరణించిన గోవుల డేటాను దాచినట్లు ఆరోపించారు. విజిలెన్స్ నివేదికలు, ఫోటోలు, వీడియోలు ప్రదర్శిస్తూ అవినీతి ఘటనలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటీవలి ఆరోపణలను ఖండించిన ఈవో, జనవరి–మార్చి మధ్య 43 గోవులు సహజంగా మరణించాయని, ఇదే సమయంలో 59 దూడలు జన్మించాయని చెప్పారు. ఖాళీగా ఉన్న గోశాల సిబ్బంది పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రస్తుత పరిస్థితి మెరుగుపడిందని, ఎవరైనా తనిఖీ చేయవచ్చని స్పష్టం చేశారు.
ఐటీ విభాగం నిబంధనలు ఉల్లంఘించిందని, ఒకే దళారి 50సార్లు టికెట్లు పొందాడని ఆరోపించారు. కల్తీ నెయ్యి సరఫరా చేసిన దాతను బ్లాక్‌లిస్ట్ చేశామని, ప్రస్తుతం నందిని నెయ్యిని వాడుతున్నామని తెలిపారు. ఆర్గానిక్ ప్రసాదాల పేరుతో రూ.3 కోట్లు విలువైన సరుకులకు రూ.25 కోట్లు చెల్లించారని, పాల టెండర్ రద్దు చేశామని వెల్లడించారు.
TTDలో పారదర్శక పాలన కోసం చర్యలు కొనసాగుతున్నాయని ఈవో వివరించారు.
