అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అధికారంలోకి వచ్చిన తొలి రోజే పలు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకం చేసిన ఆయన, మరో కీలకమైన నిర్ణయానికి సిద్ధమవుతున్నారు. అమెరికా చరిత్రలోనే తొలిసారి ఇంగ్లీష్‌ను అధికారిక భాషగా ప్రకటించేందుకు ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేయబోతున్నారని వైట్ హౌస్ అధికారి వెల్లడించారు.
అమెరికాలో 50 రాష్ట్రాలుంటే, వాటిలో 32 రాష్ట్రాలు ఇప్పటికే ఇంగ్లీష్‌ను అధికారిక భాషగా స్వీకరించాయి. అయితే, టెక్సాస్, న్యూ మెక్సికో వంటి కొన్ని రాష్ట్రాల్లో స్పానిష్ మాట్లాడేవారు ఎక్కువగా ఉండటంతో ఈ నిర్ణయంపై మిశ్రమ స్పందన కనిపిస్తోంది. ముఖ్యంగా టెక్సాస్‌లో స్పానిష్ ప్రాధాన్యం ఎక్కువగా ఉండటం వల్ల, ఇలాంటి నిర్ణయం ఆ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.
ట్రంప్ అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు, 2015లో న్యూయార్క్‌లో జరిగిన ఓ సమావేశంలో మాట్లాడుతూ, “మనది ఇంగ్లీష్ మాట్లాడే దేశం. అందరూ ఇంగ్లీష్ నేర్చుకోవాలి” అని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఆయన నాటిన ఆ ఆలోచన ఇప్పుడు అమలులోకి వస్తుందా? అన్న ఆసక్తి నెలకొంది.
ఈ నిర్ణయంపై కొన్ని రాష్ట్రాలు, మైనారిటీ వర్గాలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. ప్రత్యేకించి లాటిన్ అమెరికా ప్రజలు, స్పానిష్ మాట్లాడే వర్గాలు, ఇతర భాషలకు చెందిన వలసదారులు దీని వల్ల తమ హక్కులకు నష్టం కలుగుతుందని భావిస్తున్నారు. ట్రంప్ నిర్ణయంపై వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, భాషా సంఘాలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి.
