అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయాన్ని సాధించారు. తన గెలుపు అనంతరం తొలిసారి ప్రసంగించిన ట్రంప్, ప్రపంచ కుబేరుడు, టెస్లా, ఎక్స్, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ పై ప్రశంసల వర్షం కురిపించారు. అమెరికా రాజకీయాల్లో సరికొత్త స్టార్ ఎలాన్ మస్క్ అని ఆయన వ్యాఖ్యానించారు. ట్రంప్ తన విజయానికి మస్క్ కీలకపాత్ర పోషించారని చెప్పారు.
ట్రంప్ మస్క్ లాంటి జీనియస్ లు అమెరికాకు అవసరమని, అలాంటి వారిని కాపాడుకుంటామని స్పష్టం చేశారు. తన విజయాన్ని సాధించడానికి మస్క్ చేసిన కృషిని కొనియాడుతూ, ఫిలడెల్ఫియా, పెన్సిల్వేనియాలోని పలు ప్రాంతాల్లో రెండు వారాల పాటు మస్క్ ఎన్నికల ప్రచారం నిర్వహించారని తెలిపారు. ట్రంప్ తన ప్రసంగంలో మస్క్‌ను అద్భుతమైన వ్యక్తిగా అభివర్ణిస్తూ, “నువ్వొక అద్భుతమైన వ్యక్తి… అందుకే ఐ లవ్యూ” అని పేర్కొన్నారు. ఇది మస్క్‌కు వచ్చిన ప్రశంసలకు నిదర్శనంగా నిలిచింది.