అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన తీవ్ర వైఖరిని ప్రదర్శించారు. తమ మిత్రదేశం ఇజ్రాయెల్‌పై ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ (ఐసీసీ) తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, ఆ సంస్థపై ఆంక్షలు విధించారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై ఐసీసీ అరెస్టు వారెంట్ జారీ చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టిన ట్రంప్, ఈ చర్యలు అమెరికా సహించబోవని స్పష్టంగా చెప్పారు. గురువారం ఆయన కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేసి, ఐసీసీ హద్దులు దాటి వ్యవహరిస్తే దానికి తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
ట్రంప్ నిర్ణయంతో ఐసీసీకి చెందిన ఆస్తులను స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని, అలాగే ఆ సంస్థ అధికారులను, వారి కుటుంబాలను అమెరికాలో అడుగు పెట్టనివ్వబోమని ప్రకటించారు. ఈ నిర్ణయం తీసుకున్న కొద్దిగంటల వ్యవధిలోనే, అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో ప్రధాని నెతన్యాహు పర్యటించడం విశేషం. ట్రంప్‌తో వైట్‌హౌస్‌లో సమావేశమైన నెతన్యాహు, పలువురు అమెరికా చట్టసభ సభ్యులతో కూడా చర్చలు జరిపారు.
హమాస్ దాడులకు ప్రతిగా పాలస్తీనాలో ఇజ్రాయెల్ చేపట్టిన సైనిక చర్య వల్ల వేల మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై విచారణ చేపట్టి, నెతన్యాహు సహా మాజీ రక్షణ మంత్రి యొవ్ గెలంత్‌పై ఐసీసీ గత ఏడాది అరెస్టు వారెంట్ జారీ చేసింది. అయితే, అమెరికా, ఇజ్రాయెల్ ఐసీసీ సభ్య దేశాలు కావని, దీంతో ఈ నిర్ణయాలు అమలు చేయలేవని ట్రంప్ పేర్కొన్నారు. ఐసీసీ నిర్ణయాలు పాక్షికమైనవని, అమెరికా మిత్రదేశాలను లక్ష్యంగా చేసుకోవడం అన్యాయం అని ఆరోపించారు.
ట్రంప్ విధించిన ఆంక్షలను ఐసీసీ తీవ్రంగా ఖండించింది. మానవ హక్కుల పరిరక్షణ కోసం తమ సంస్థ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేసింది. ప్రపంచ దేశాలు ఐసీసీకి మద్దతు తెలపాలని పిలుపునిచ్చింది. ఈ నిర్ణయం అంతర్జాతీయ రాజకీయాల్లో మరింత వివాదానికి దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.