టీ20 అండర్-19 వరల్డ్ కప్‌లో త్రిష సెంచరీ రికార్డు!

Gongadi Trisha smashes a century in U-19 T20 World Cup against Scotland, scoring 100 in 53 balls. Gongadi Trisha smashes a century in U-19 T20 World Cup against Scotland, scoring 100 in 53 balls.

మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో జరుగుతున్న అండర్-19 మహిళల టీ20 వరల్డ్ కప్‌లో భారత అమ్మాయిల జోరు కొనసాగుతోంది. ఈ టోర్నీలో ఇప్పటికే సెమీఫైనల్‌కు చేరుకున్న టీమిండియా, స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారీ స్కోరు చేసింది. భారత ఓపెనర్ గొంగడి త్రిష తన మెరుపు సెంచరీతో ప్రపంచ రికార్డు సృష్టించింది. టీ20 అండర్-19 వరల్డ్ కప్ చరిత్రలో తొలి సెంచరీ చేసిన బ్యాటర్‌గా త్రిష నిలిచింది.

తెలంగాణలోని భద్రాచలంకు చెందిన త్రిష ఈ మ్యాచ్‌లో 53 బంతుల్లో శతకం సాధించింది. మొత్తం 59 బంతులు ఆడి 13 ఫోర్లు, 4 సిక్సులతో అజేయంగా 110 పరుగులు చేసింది. మరో ఓపెనర్ కమలిని 42 బంతుల్లో 51 పరుగులు చేసింది. దీంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 1 వికెట్ మాత్రమే కోల్పోయి 208 పరుగుల భారీ స్కోరు చేసింది.

209 పరుగుల లక్ష్యఛేదనలో స్కాట్లాండ్ కష్టాల్లో పడింది. భారత బౌలర్ల ధాటికి స్కాటిష్ జట్టు తడబడింది. 10 ఓవర్లకే 7 వికెట్లు కోల్పోయి 43 పరుగులకే నిలిచిపోయింది. భారత బౌలర్లలో ఆయుషి శుక్లా, వైష్ణవి శర్మ తలో మూడు వికెట్లు తీసి స్కాట్లాండ్‌ను కట్టడి చేశారు.

త్రిష అద్భుత ఇన్నింగ్స్‌పై సోషల్ మీడియాలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. భద్రాచలంకు చెందిన త్రిష తెలుగమ్మాయి కావడంతో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆమె ఆటపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. మరి ఈ టోర్నీలో భారత అమ్మాయిలు ఇంకా ఏవే రికార్డులు బద్దలు కొడతారో చూడాలి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *