సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు, నెగెటివ్ కామెంట్లపై నటి త్రిష తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా స్పందించిన ఆమె, విషపూరిత స్వభావంతో ఎలా జీవిస్తున్నారంటూ విమర్శకులపై మండిపడ్డారు.
“విషపూరితమైన వ్యక్తులు… మీకు నిద్ర ఎలా పడుతుంది? బురద జల్లడమే మీ పనేనా? పిచ్చిపోస్టులతో ఆనందపడే మీలా వ్యక్తుల్ని చూస్తే భయమేస్తోంది. నిజంగా మీది పిరికితనం” అంటూ త్రిష గట్టిగా స్పందించారు. దేవుడి ఆశీస్సులు మీతో ఉండాలని తాను కోరుకుంటున్నానని కూడా అన్నారు.
ఇది తొలిసారి కాదు. గతంలోనూ త్రిష ఈ తరహా నెగెటివ్ ప్రచారాలపై స్పందించారు. అప్పట్లోనూ పనిలేని వారి మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని స్పష్టంగా చెప్పారు. ఆమెకు ఎదురవుతున్న విమర్శలను త్రిష తీవ్రమైన మనోవేదనగా భావించినట్టు కనపడింది.
తాజాగా త్రిష నటించిన “గుడ్ బ్యాడ్ అగ్లీ” సినిమా విడుదల కావడంతో, ఆమె పాత్రపై నెగెటివ్ రివ్యూలు రావడంతో ఈ రీతిగా స్పందించారు. నటన బావోలేదని, తమిళం తెలిసిన త్రిష తన పాత్రకు వేరే వ్యక్తితో డబ్బింగ్ చెప్పించడాన్ని కొందరు తప్పుపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే త్రిష నెగెటివ్ వ్యాప్తిపై ఘాటుగా స్పందించారు.
