కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలో వైద్యుల విహార యాత్ర విషాద యాత్రగా మారింది. హైదరాబాద్‌కు చెందిన 27 ఏళ్ల అనన్య రావు హంపీ పర్యటనలో భాగంగా తన స్నేహితులతో కలిసి తుంగభద్ర నదికి వెళ్లారు. సరదాగా ఈత కొట్టేందుకు నీళ్లలోకి దూకిన ఆమె ప్రవాహం పెరగడంతో గల్లంతయ్యారు. సహాయక బృందాలు రంగంలోకి దిగినా అప్పటికే ఆలస్యం అయ్యింది.
అనన్య రావుకు ఈత అంటే ఎంతో ఇష్టం. స్నేహితులు సాత్విన్, హషితలతో కలిసి హంపీ టూర్ వెళ్లిన ఆమె, అక్కడ పర్యాటక ప్రాంతాలను సందర్శించారు. బుధవారం మధ్యాహ్నం తుంగభద్ర నదికి వెళ్లి 25 అడుగుల ఎత్తు నుంచి నీటిలోకి దూకారు. అయితే, ప్రవాహం అధికంగా ఉండటంతో ఆమె కొట్టుకుపోయారు.
తనను కాపాడేందుకు గజ ఈతగాళ్లు వెంటనే నీళ్లలోకి దూకినా ఫలితం దక్కలేదు. రాత్రివరకు అన్వేషణ కొనసాగినా, గురువారం ఉదయం అనన్య మృతదేహాన్ని వెలికి తీశారు. ఈ ఘటనతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. స్నేహితులు, సహచర వైద్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
తుంగభద్ర నదిలో తేలికగా ఈత కొట్టడం ప్రమాదకరమని అధికారులు హెచ్చరిస్తున్నారు. అనన్య రావు ప్రమాదంలో పడిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. జాగ్రత్తలు పాటించాలని, అపరిచిత నీటిమడుగుల్లో ఆడుకునే ముందు భద్రతా చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.