మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు పెద్ద ఎత్తున నదీస్నానాలు చేస్తున్నారు. ఈ క్రమంలో తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడి మండలంలోని తాడిపూడి వద్ద విషాదం చోటుచేసుకుంది. గోదావరిలో నదీస్నానానికి దిగిన ఐదుగురు యువకులు నీటిలో గల్లంతయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు ప్రారంభించారు. అయితే, ఎంత ప్రయత్నించినా యువకుల ఆచూకీ తెలియలేదు. ఘటనాస్థలంలో భక్తుల ఆందోళన నెలకొంది.
ఈ క్రమంలో గజ ఈతగాళ్లు చేపట్టిన గాలింపు చర్యల్లో ఒక యువకుడి మృతదేహం లభ్యమైంది. మిగతా నలుగురి కోసం గాలింపు కొనసాగుతోంది. గల్లంతైనవారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తాజా ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. పోలీసు బలగాలు, రెస్క్యూ టీములు నిరంతరం గాలింపు కొనసాగిస్తున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. భక్తులకు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
