ఇండోనేషియాలో డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో ముగ్గురు భారతీయులు తీవ్ర ప్రమాదంలో చిక్కుకున్నారు. తమిళనాడుకు చెందిన రాజు ముత్తుకుమారన్, సెల్వదురై దినకరన్, విమలకందన్‌లు గతేడాది జులైలో సింగపూర్ జెండా కలిగిన ఓడలో భారీగా మాదకద్రవ్యాలు తరలిస్తున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పోలీసులు 106 కిలోల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఈ కేసులో అరెస్టైన ముగ్గురు భారతీయులకు అక్కడి కోర్టు మరణశిక్ష విధించే అవకాశముందని అంతర్జాతీయ మీడియా కథనాల్లో వెల్లడించారు. డ్రగ్స్ అక్రమ రవాణాకు సంబంధించి ఇండోనేషియా కఠినమైన చట్టాలను అమలు చేస్తోంది. ఏప్రిల్ 15న ఈ ముగ్గురితో పాటు ఓడ కెప్టెన్‌పై కూడా తీర్పు వెలువడే అవకాశం ఉంది.
నిందితుల తరఫున భారతీయ న్యాయవాది జాన్ పాల్ కోర్టులో వాదనలు వినిపిస్తున్నారు. కెప్టెన్‌కు తెలియకుండా ఓడలో ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ తరలించడం సాధ్యం కాదని, అసలైన నిందితులు తప్పించుకున్నారని ఆయన కోర్టుకు తెలిపారు. అమాయకులైన ముగ్గురిని ఈ కేసులో ఇరికించారని ఆయన వాదిస్తున్నారు.
ఇదివరకు ఇండోనేషియాలో పలువురు విదేశీయులకు డ్రగ్స్ కేసుల్లో మరణశిక్ష విధించారు. భారత ప్రభుత్వం ఈ కేసును సమగ్రంగా పరిశీలించాలని, నిందితులకు సహాయం అందించేందుకు చొరవ చూపాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.
